అప్పులిచ్చేటప్పుడే జాగ్రత్త పడండి .. ఎన్​బీఎఫ్​సీలకు ఫైనాన్స్​ మినిస్టర్​ సూచన

అప్పులిచ్చేటప్పుడే జాగ్రత్త పడండి .. ఎన్​బీఎఫ్​సీలకు ఫైనాన్స్​ మినిస్టర్​ సూచన

న్యూఢిల్లీ : అప్పులు ఇచ్చే టైములోనే నాన్​బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీలు (ఎన్​బీఎఫ్​సీ), స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ గురువారం సూచించారు. ఈ విషయంలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా చెప్పిన గైడెన్స్​ను పాటించాలని చెప్పారు. బిజినెస్​ పెంచుకునే విషయంలో దూకుడు ప్రదర్శించడం కాకుండా, ఆర్​బీఐ రూల్స్​సక్రమంగా పాటిస్తూ గ్రోత్​ సాధించాలని నిర్మలా సీతారామన్​ సలహా ఇచ్చారు. డేట్​ విత్​ టెక్ పేరిట జరిగిన ఒక ​ ఈవెంట్లో ఫైనాన్స్​ మినిస్టర్​ మాట్లాడారు.

బిజినెస్​ పెంచుకోవాలనే ఆశ మంచిదేనని, కాకపోతే కొన్ని సందర్భాలలో ఇది ఇబ్బందులు తేవొచ్చని అన్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఆర్​బీఐ ఎన్​బీఎఫ్​సీలు, స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంకులకు హెచ్చరిక జారీ చేస్తోందని పేర్కొన్నారు. ఎన్​బీఎఫ్​సీలు  అప్పులు ఇవ్వడంలో దూకుడు ప్రదర్శించి, ఆ తర్వాత సమస్యలను కొని తెచ్చుకోకూడదనే తమ అభిప్రాయమని ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. ఫైనాన్షియల్​ స్టెబిలిటీని దృష్టిలో పెట్టుకునే ఎన్​బీఎఫ్​సీలు, స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంకులకు ఇంతకు ముందే వార్నింగ్​ జారీ చేసినట్లు  ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత  దాస్​ బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇది ముందు జాగ్రత్త చర్యేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అన్​సెక్యూర్డ్​లోన్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో పాటు, చెల్లింపులలో ఎగవేతలు కూడా అలాగే ఎక్కువవుతుండటంతో ఆర్​బీఐ ఈ వార్నింగ్​ ఇచ్చింది. అన్​సెక్యూర్డ్​ లోన్లకు రిస్క్​ వెయిట్‌‌​ ఎక్కువ చేయమని ఆర్​బీఐ ఎన్​బీఎఫ్​సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్​సెక్యూర్డ్​ కన్జూమర్​ లోన్లు, క్రెడిట్​ కార్డులపై రిస్క్​ వెయిట్‌‌ను 25 పర్సంటేజ్​ పాయింట్లు పెంచి 125–150 శాతంగా మార్చింది. ఈ నిర్ణయం వల్ల ఒక్క బ్యాంకులపైనే రూ. 84 వేల కోట్ల క్యాపిటల్ కాస్ట్​ పడుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. హౌసింగ్​లోన్లు, ఎడ్యుకేషన్​ లోన్లు, వెహికల్​ లోన్లు, గోల్డ్​ లోన్లను తాజా రిస్క్​ వెయిట్‌‌​ నుంచిమినహాయించారు.

పాత, కొత్త లోన్లకూ హై రిస్క్​ వెయిట్‌‌​...

ఇప్పటికే ఇచ్చిన అన్​సెక్యూర్డ్​ లోన్లకు,  కొత్తగా ఇచ్చే లోన్లకు కూడా కొత్త రూల్ వర్తిస్తుందని ఆర్​బీఐ స్పష్టం చేసింది. రిస్క్​ వెయిట్​ అంటే  ఇచ్చే అప్పుల కోసం ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు కొంత మొత్తాన్ని పక్కకు పెట్టడం. దీని వల్ల బ్యాంకుల మూలధన ఖర్చు ఎక్కువవుతుంది. అంతేకాదు, బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల అప్పులు ఇచ్చే కెపాసిటీ కొంత మేర తగ్గిపోతుంది. క్రెడిట్​ కార్డ్​ రిసీవబుల్స్​ విషయంలోనే ఇదే తరహా ఆదేశాలను ఆర్​బీఐ జారీ చేసింది.

సెప్టెంబర్​ 2023 చివరి నాటికి పర్సనల్​ లోన్లు రూ. 48,26,833 కోట్లకు చేరాయి. 2022 సెప్టెంబర్​ చివరితో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. కన్జూమర్​ క్రెడిట్​ విషయంలో బోర్డ్​ లెవెల్లో రివ్యూలు జరిపి, అవసరమైతే కొన్ని పరిమితులు విధించుకోవాలని కూడా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలకు ఆర్​బీఐ సూచించింది. అన్ని కేటగిరీల అన్​సెక్యూర్డ్​ లోన్ల విషయంలోనూ లిమిట్స్​ పెట్టుకోవాలని సలహా ఇచ్చింది.

అకౌంట్​ యాగ్రిగేటర్ల చేతిలో డేటా సేఫే

అకౌంట్ యాగ్రిగేటర్లతో పంచుకున్న డేటా భద్రంగానే ఉంటుందని నిర్మలా సీతారామన్​ హామీ ఇచ్చారు. అకౌంట్ యాగ్రిగేటర్​ స్కీము తాను అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదని చెబుతూ, ఈ విషయంలో అవగాహనను బహుశా మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే, టెక్నాలజీని మరింత ఈజీ చేయాల్సి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పబ్లిక్​, ప్రైవేట్​ సెక్టార్​ బ్యాంకులతో ఈ అంశంపై డిస్కషన్స్​ జరిగాయని, అకౌంట్​ యాగ్రిగేటర్స్​ వర్కింగ్​లో బ్యాంకులు భాగమయ్యాయని అన్నారు. ఈ సిస్టమ్ బ్యాంకులకు కొంత సాయపడుతుందనే ఫీడ్​బ్యాక్​ వచ్చిందని పేర్కొన్నారు.

అకౌంట్​ యాగ్రిగేటర్ల చేతిలోనే డేటా ఉంటుందని మొదట్లో భయాలు వ్యక్తమయ్యాయని, కానీ నిజానికి వాటి ద్వారా డేటా బదిలీ మాత్రమే జరుగుతుందని, యాగ్రిగేటర్లు డేటాను అట్టిపెట్టుకునే వీలు లేదని నిర్మలా సీతారామన్​ చెప్పారు. కస్టమర్​ అప్పు తీసుకునేటప్పుడు, బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు మాత్రమే అకౌంట్​ యాగ్రిగేటర్లు డేటాను వాడతాయని పేర్కొన్నారు. ఫైనాన్షియల్​ ఇన్ఫర్మేషన్​ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్​ ఇన్ఫర్మేషన్​ యూజర్ల మధ్య వారధిగా అకౌంట్​ యాగ్రిగేటర్​ సిస్టమ్​ను తీసుకొచ్చారు. కస్టమర్లు ఇచ్చే అనుమతి మేరకే ఈ సిస్టమ్​ పనిచేస్తుంది.