
- వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే తెలంగాణ మోడల్: మీనాక్షి నటరాజన్
- వికారాబాద్ జిల్లా రంగాపూర్ నుంచి జనహిత పాదయాత్ర ప్రారంభం
- పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, సురేఖ
హైదరాబాద్‌సిటీ/పరిగి: వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే తెలంగాణ మోడల్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ‘‘రాహుల్ గాంధీ 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలోని ప్రతి ఒక్కరి మనసు తెలుసుకున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీని అనుసరించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది” అని తెలిపారు. పాదయాత్ర చేస్తే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్న రాహుల్‌గాంధీ పిలుపు మేరకు గురువారం సాయంత్రం వికారాబాద్‌జిల్లా పరిగి సమీపంలోని రంగాపూర్ నుంచి మీనాక్షి నటరాజన్జనహిత పాదయాత్ర ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. పరిగి వరకు పాదయాత్ర చేసి కొడంగల్చౌరస్తాలో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ‘‘పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రైతు భరోసా అమలు చేస్తున్నాం.
అన్ని వర్గాల పిల్లలు ఒకే పాఠశాలలో చదువుకునేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం. పూలే, మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నది” అని చెప్పారు. కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాహుల్‌గాంధీ పోరాటం చేస్తుంటే.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆమె కోరారు.
పాదయాత్రతో దేశాన్ని చదవొచ్చు: మహేశ్‌గౌడ్
పది కిలోమీటర్ల పాదయాత్రతో ఏం తెలుసుకుంటారని ప్రతిపక్షాలు చేసిన కామెంట్స్ ను పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తిప్పి కొట్టారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. పాదయాత్రతో దేశాన్ని చదవొచ్చు.. ప్రజల స్థితిగతులను తెలుసుకోవచ్చు” అని అన్నారు. “కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్య ఉండే పార్టీ. ఈ యాత్ర పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి, సోనియా గాంధీపై నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజల కోసం” అని తెలిపారు.
ఇప్పటి వరకూ 65వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 35,000 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చరిత్రలో ఉండదు గాక ఉండదని పేర్కొన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్ల సాధన మన ముందున్న పోరాటం. ఈ విషయంలో బీజేపీ మోసం చేస్తున్నది. అందుకే ఆగస్టు 5,6,7 తేదీల్లో ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్లతో కవితకు ఏం సంబంధం ఉంది? మనం పడ్డ ప్రయాస ఏంటో బీఆర్ఎస్ నాయకులకు ఏం తెలుసు?” అని ఆయన అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రావాలి: శ్రీధర్ బాబు
ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక , రాజకీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తున్నదని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే కలిసి రావాలని సూచించారు. చట్టాలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గౌరవం, అవగాహన లేదని మండిపడ్డారు. పాలనను ప్రజలకు చేరువ చేయడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.