ధరలు తగ్గుతయ్​..ఆహార ఇన్​ఫ్లేషన్​ మాత్రం పెరగొచ్చు

ధరలు తగ్గుతయ్​..ఆహార ఇన్​ఫ్లేషన్​ మాత్రం పెరగొచ్చు

న్యూఢిల్లీ: దేశవిదేశీ మార్కెట్లలో ఇబ్బందులు, ఇన్​ఫ్లేషన్​ ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ,  ప్రభుత్వ ముందస్తు చర్యలతో ధరలు దిగివస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.  తాజా పంటల రాక కూడా ఇన్​ఫ్లేషన్​ను తగ్గిస్తుందని పేర్కొంది. గోధుమలు,  బియ్యం సేకరణ ఊపందుకుందని, ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ స్థాయిలను పెంచుతున్నామని తెలిపింది. అయితే ఆహార పదార్థాల ఇన్​ఫ్లేషన్ రాబోయే నెలల్లో కొంచెం పెరగవచ్చని స్పష్టం చేసింది. దేశీయ వినియోగం,  పెట్టుబడి.. డిమాండ్ వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని జులై నెలవారీ ఆర్థిక సమీక్షలో మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కోసం చేసిన భారీ కేటాయింపులు  ప్రైవేట్ పెట్టుబడులను పెంచుతున్నాయని తెలిపింది. 

 రిటైల్ ఇన్​ఫ్లేషన్ జులై 2023లో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి పెరిగింది. కొన్ని రకాల ఆహార వస్తువులు  ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. అయితే కోర్​ ఇన్​ఫ్లేషన్ 39 నెలల కనిష్ట స్థాయి 4.9 శాతం వద్ద ఉంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,  కూరగాయల ధరలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జులైలో  రెండంకెల మేర పెరిగాయి. దేశీయ ఉత్పత్తిలో తగ్గుదల కూడా ఇన్​ఫ్లేషన్​ ఒత్తిడిని తీవ్రతరం చేసింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో తెల్ల ఈగ వ్యాధి కారణంగా టమోటా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడింది. ఉత్తర భారతదేశంలో అధిక వర్షాల వల్ల టమోటా ధరలు పెరిగాయి. 

2022-–23 ఖరీఫ్ సీజన్‌‌‌‌లో తక్కువ సాగు కారణంగా పప్పు ధర కూడా పెరిగింది. "ఆహార ఇన్​ఫ్లేషన్​ను అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. తాజా స్టాక్ రాక త్వరలో మార్కెట్లో ధరల ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది. ఆహార వస్తువుల ధరల ఒత్తిడి తాత్కాలికమే కావొచ్చు. గ్లోబల్ మార్కెట్లలో ఆటుపోట్లు, దేశీయ మార్కెట్లలో ఇబ్బందులు రాబోయే నెలల్లో ఇన్​ఫ్లేషన్​ ఒత్తిడిని పెంచవచ్చు. ప్రభుత్వం,  ఆర్‌‌‌‌బిఐ మరింత అప్రమత్తంగా ఉండాలి” అని రిపోర్ట్​ పేర్కొంది. 

కొన్నింటి ఇన్​ఫ్లేషన్ ​ మాత్రమే ఎక్కువ..

2014లో కొత్త సీపీఐ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జులైలో ఆహార ఇన్​ఫ్లేషన్ మూడవ అత్యధికం. అయినప్పటికీ, కేవలం 48 శాతం ఆహార పదార్థాలకు మాత్రమే 6 శాతానికి పైగా ఇన్​ఫ్లేషన్ ఉంది.  ఇందులో రెండంకెల ఇన్​ఫ్లేషన్​తో కూడిన 14 ఆహార పదార్థాలు ఉన్నాయి. టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వంటి వస్తువులు 50 శాతానికి పైగా ఇన్​ఫ్లేషన్​ను నమోదు చేశాయి.  కొన్ని రకాల వస్తువుల ధరలలో అసాధారణ పెరుగుదల జులై 2023లో అధిక ఆహార ఇన్​ఫ్లేషన్​కు దారితీసింది. "ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబరు ప్రారంభంలో తాజా స్టాక్‌‌‌‌ల రాకతో టొమాటో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.  

పప్పుల దిగుమతులు పెరగడం వల్ల వాటి ధరలు తగ్గవచ్చు. ఇటీవలి ప్రభుత్వ ప్రయత్నాలు ఇందుకు సాయపడతాయి”అని రిపోర్ట్ స్పష్టం చేసింది. నల్ల సముద్రం ధాన్యం ఒప్పందాన్ని రద్దు చేయాలన్న రష్యా నిర్ణయంతో గ్లోబల్​ మార్కెట్లలో ఆటుపోట్లు తలెత్తాయి. గోధుమలు పండే ప్రాంతాలలో పొడి వాతావరణ పరిస్థితులు తృణధాన్యాల ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. కొన్ని రకాల తెగుళ్లు, అతివృష్టి, అనావృష్టి వంటివి మనదేశంలో కూరగాయల ధరలపై ఒత్తిడి తెచ్చాయి. ఆర్​బీఐ  వడ్డీ రేట్ల  కమిటీ  పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఈ నెల ప్రారంభంలో నిర్ణయించింది. 

 వృద్ధికి మద్దతునిస్తూ ఇన్​ఫ్లేషన్  లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూడటంపై ఫోకస్​ చేసింది. రాబోయే నెలల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని అంచనా వేసింది. అయితే ఆకస్మిక వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో పరిస్థితుల వంటివి దేశీయ ఆహార ధరలపై ప్రభావం చూపుతాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్​ఫ్లేషన్ అంచనాను 5.1 శాతం నుంచి 5.4 శాతానికి మార్చింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల సీజన్‌‌‌‌లో ఇప్పటి వరకు ఆరుశాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఆగస్ట్ 18, 2023 నాటికి, రైతులు 102.3 మిలియన్ హెక్టార్లలో విత్తారు. ఇది గత సంవత్సరం స్థాయికి సమానం.  గత ఐదేళ్ల సగటు కంటే 1.1 % ఎక్కువ.