హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’కు ఆర్థిక అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1986 నాటి టీవీవీపీ చట్టాన్ని రద్దు చేస్తూ 2026, ఏప్రిల్ 30న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాత వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజాగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ విజ్ఞప్తి మేరకు ఈ కొత్త డైరెక్టరేట్‌కు పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన అధికారాలను కట్టబెడుతూ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నంబర్ 72ను విడుదల చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌ను స్వతంత్ర హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్ఓడీ)గా ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిధుల కేటాయింపు, బడ్జెట్ వినియోగంపై ఈ విభాగానికి పూర్తిస్థాయిలో ఆర్థిక అధికారాలు లభించనున్నాయి.
