అప్పుల బాధతో నలుగురు సూసైడ్‌‌‌‌... సిరిసిల్ల, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఘటనలు

అప్పుల బాధతో నలుగురు సూసైడ్‌‌‌‌...    సిరిసిల్ల, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఘటనలు
  • మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా నవాబుపేటలో ఘటన‌‌‌
  • ఫైనాన్స్‌‌‌‌ సంస్థ వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
  • సిరిసిల్ల, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఇద్దరు రైతులు

నవాబుపేట, వెలుగు : అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు ఇచ్చిన ఫైనాన్స్‌‌‌‌ సంస్థ వేధించడం, ఇల్లు వేలం వేస్తామని బెదిరించడం వల్లే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా నవాబుపేట మండలంలోని దొడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి శివకుమార్ (20) కొంత అప్పు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. 

ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ సంస్థలో మరికొంత అప్పు తీసుకొని బొలెరో ట్రాలీ కొనుక్కొని దానిని నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఇంటి నిర్మాణం, వాహనం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి పద్మమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్‌‌‌‌ తెలిపారు. 

ఫైనాన్స్‌‌‌‌ వేధింపులే కారణం : కుటుంబ సభ్యులు

శివకుమార్‌‌‌‌ ఆత్మహత్యకు చోళా ఫైనాన్స్‌‌‌‌ సంస్థ వేధింపులే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. శివకుమార్‌‌‌‌ చోళా ఆటో ఫైనాన్స్‌‌‌‌ సంస్థలో రూ. 6 లక్షలు అప్పు తీసుకొని బొలెరో కొన్నాడని, ఇప్పటివరకు రూ. 4 లక్షల వరకు అప్పు కట్టగా.. మరో రూ. 2 లక్షలు బకాయి ఉందని చెప్పారు. ఈ విషయంపై ఫైనాన్స్‌‌‌‌ సిబ్బంది వేధించడంతో పాటు అప్పు చెల్లించకపోతే ఇంటిని వేలం వేస్తామని హెచ్చరిస్తూ గోడపై రాశారని వాపోయారు. దీంతో మనస్తాపానికి గురై శివకుమార్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఫైనాన్స్‌‌‌‌ సంస్థ పేరు చెప్పినా.. పోలీసులు ఫిర్యాదులో పేర్కొనలేదని ఆరోపించారు. 

మరో ఇద్దరు రైతులు

వేములవాడరూరల్/కేసముద్రం, వెలుగు : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌‌‌‌ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మొగిలి లక్ష్మణ్‌‌‌‌ (45) వ్యవసాయంతో పాటు కారు కిరాయికి నడిపిస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయం కోసం రెండు బోర్లు వేయగా.. నీరు పడలేదు. సాగు చేసిన అప్పులు పెరిగిపోవడంతో పాటు, కారు ఈఎంఐ కూడా చెల్లించేందుకు ఇబ్బందులు ఎదురవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్‌‌‌‌ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వేములవాడ రూరల్‌‌‌‌ ఎస్సై చల్లా వెంకట్రాజం తెలిపారు. అలాగే మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేసముద్రం మండలంలోని పీక్లా తండాకు చెందిన గుగులోతు భాస్కర్​(40) తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. దిగుపడి సరిగా రాకపోవడంతో వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురైన భాస్కర్‌‌‌‌ ఆదివారం రాత్రి తన ఇంటి ఆవరణలోని పశువుల పాకలో ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

బైక్‌‌‌‌ ఈఎంఐ కట్టలేక...

శంకరపట్నం, వెలుగు : బైక్‌‌‌‌ ఈఎంఐ కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కటికరెడ్డి సుమంత్ (24) ఆదివారం పొలం వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు, అక్కడి నుంచి వరంగల్‌‌‌‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ సోమవారం చనిపోయాడు. బైక్‌‌‌‌ ఈఎంఐ కట్టలేకే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెదనాన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.