వలస కూలీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ..తెలంగాణ ప్రభుత్వం ఎమ్మార్సీ సెంటర్లు ఏర్పాటు

వలస కూలీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ..తెలంగాణ ప్రభుత్వం   ఎమ్మార్సీ సెంటర్లు ఏర్పాటు
  • పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద నారాయణపేట జిల్లా కోస్గి మండలం
  • నిజామాబాద్‌‌ జిల్లా సిరికొండ మండలాలు ఎంపిక
  • మారుమూల గ్రామాల్లోనూ సేవలు అందించేందుకు మొబైల్‌‌ వ్యాన్ల ఏర్పాటు
  • వలస వెళ్లిన వారి కుటుంబాలకు జీవనోపాధి కల్పిచేందుకు ప్రయత్నాలు

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : వలస కూలీల సమాచారం, వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద రెండు మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. అక్కడ మైగ్రేషన్‌‌ రిసోర్స్‌‌ సెంటర్ల (ఎమ్మార్సీ)ను ప్రారంభించింది.

 ఈ సెంటర్ల ద్వారా వలస వెళ్లాలనుకునే వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు సురక్షితమైన వలసలు, ఉద్యోగాల గురించి అవగాహన కల్పించనున్నారు. అలాగే వలస వెళ్లిన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద కోస్గి, సిరికొండ మండలాలు

ఎమ్మార్పీ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద తెలంగాణలో ఎక్కువగా వలసలు వెళ్లే ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలోని  కోస్గి మండలాన్ని, నిమాజాబాద్‌‌ జిల్లాలోని సిరికొండ మండలాన్ని ఎంపిక చేసింది. ఆయా మండలాల్లో ఇంటర్నేషనల్‌‌ ఆర్గనైజేషన్‌‌ ఫర్‌‌ మైగ్రేషన్‌‌ (ఐవోఎం), ఫుడ్‌‌ అండ్‌‌ అగ్రికల్చర్‌‌ ఆర్గనైజేషన్‌‌ (ఎఫ్​ఏవో) సంయుక్తంగా మైగ్రేషన్‌‌ మల్టీ పార్ట్‌‌నర్‌‌ ట్రస్ట్‌‌ ఫండ్‌‌, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, వాసన్ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్లను ప్రారంభించారు. 

వలస కూలీలకు, వారి కుటుంబాలకు, వలస వెళ్లాలనుకునే వారికి అవసరమైన సమాచారం అందించేందుకు 1800 -599 -1393 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సెంటర్ల సేవలను మారుమూల గ్రామాలకు సైతం విస్తరించేందుకు మొబైల్‌‌ వ్యాన్‌‌ను సిద్ధం చేశారు.

 నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌‌ను, మొబైల్‌‌ వ్యాన్‌‌ను ఇటీవల కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌ ప్రారంభించారు. మొబైల్‌‌ వ్యాన్‌‌లో ఏర్పాటు చేసిన 42 ఇంచుల ఎల్‌‌ఈడీ స్క్రీన్‌‌ ద్వారా గ్రామాల్లో వలస కూలీలు, వారి కుటుంబాలకు అందించే సేవలపై అవగాహన కల్పించనున్నారు.

సెంటర్‌‌ ద్వారా అందించే సేవలు

వాతావరణంలో మార్పుల వల్ల కలిగే వైపరీత్యాలను తట్టుకునేందుకు వలస కూలీల కుటుంబాలకు, మహిళలు, యువతకు వ్యవసాయ, వ్యవసాయేతర జీవనోపాధులను ఎంఆర్‌‌సీ సెంటర్ల ద్వారా మెరుగుపరచనున్నారు. ఇందుకోసం వారికి అవసరమైన ట్రైనింగ్‌‌ ఇస్తారు. 

సురక్షితమైన, క్రమబద్ధమైన వలసల గురించి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస పోవాలనుకునే వారికి రిజిస్టర్డ్‌‌ ఏజెన్సీలు, ఏజెంట్ల సాయంతో సరైన ధ్రువపత్రాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటారు. 

వలస కూలీల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్‌‌ సంస్థల సహకారంతో ఆర్థికసాయం అందించనున్నారు. విదేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై టామ్‌‌కామ్‌‌ సహకారంతో సమాచారం అందిస్తారు. ఎన్‌‌ఏసీ, సెట్విన్, టీఐడీఈఎస్, ఐటీఐ, నేషనల్‌‌ స్కిల్‌‌ ట్రైనింగ్‌‌ ఇన్స్‌‌స్టిట్యూట్‌‌, ప్రైవేట్‌‌ నైపుణ్య శిక్షణ కేంద్రాల గురించి వివరించనున్నారు.

 భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్‌‌ బోర్డులో నమోదు చేసుకోవడానికి, సంక్షేమ ప్రయోజనాలు పొందడానికి సహాయం చేయనున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వలస కూలీలు, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్‌‌ సైతం ఇస్తారు. రిఫెరల్‌‌ సేవల కోసం సహాయం చేస్తారు. వలస వెళ్లి తిరిగొచ్చే వారికి కుటుంబంతో, సమాజంతో సమైక్యంపై అవగాహన కల్పిస్తారు.  కార్మిక శాఖ ప్రచురించే ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి, జాబ్‌‌మేళాల గురించి సమాచారం అందించనున్నారు.

మేకలు, పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు సైతం...

పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద ఎంపికైన మండలాల్లో వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వారికి చిన్న చిన్న ఆర్థిక వనరుల ద్వారా ఆదాయ మార్గాలను చూపించేందుకు ప్లాన్‌‌ చేస్తోంది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేకలు, పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు మంజూరు చేయాలన్న విషయంపై ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది. 

ఒక యూనిట్‌‌ కాస్ట్‌‌ ఎంత నిర్ణయించాలి ? ఒక యూనిట్‌‌లో ఎన్ని మేకలు ఉండాలి ? కోళ్ల షెడ్లు ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవాలి ? ఎన్ని కోళ్లను పెంచాలి ? సబ్సిడీ ఎంత అందించాలి ? అన్న విషయాలపై రిపోర్ట్‌‌ తయారు చేయనున్నారు. ప్రభుత్వం నుంచి గైడ్‌‌లైన్స్‌‌ రాగానే వలస కూలీల కుటుంబాలకు ఈ యూనిట్లను మంజూరు చేయనున్నారు.