ఫైనల్ జర్నీ షురూ.. ఆగస్టు 23న ల్యాండింగ్​కు ఇస్రో రెడీ

ఫైనల్ జర్నీ షురూ..  ఆగస్టు 23న ల్యాండింగ్​కు ఇస్రో రెడీ

బెంగళూరు:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్–3 మిషన్ లో మరో కీలక ఘట్టం ముగిసింది. చంద్రుడి చుట్టూ163 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్ లోని ప్రొపల్షన్ మాడ్యూల్, విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ గురువారం మధ్యాహ్నం వేర్వేరుగా విడిపోయాయి. ప్రొపల్షన్ మాడ్యూల్ కొన్ని సంవత్సరాల పాటు చంద్రుడి చుట్టూ ఇదే కక్ష్యలో తిరగనుండగా.. ల్యాండర్ మాడ్యూల్ మాత్రం తన ఫైనల్ జర్నీని షురూ చేసింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇది డీబూస్ట్ అయి.. చంద్రుడికి 100 కిలోమీటర్లు దూరం ఉండే కక్ష్యలోకి దిగనుందని ఇస్రో వెల్లడించింది. ఆ తర్వాత 5 రోజులు అందులోనే తిరుగుతూ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగనుందని తెలిపింది. 

‘‘నన్ను మోసుకొచ్చినందుకు థ్యాంక్స్ మిత్రమా! అంటూ ప్రొపల్షన్ మాడ్యూల్(పీఎం)కు ల్యాండర్ మాడ్యూల్(ఎల్ఎం) కృతజ్ఞతలు చెప్పింది. గురువారం మధ్యాహ్నం రెండూ విజయవంతంగా విడిపోయాయి. శుక్రవారం సాయంత్రం ప్లాన్ ప్రకారం ఎల్ఎం మరింత తక్కువ కక్ష్యలోకి దిగనుంది” అని ఇస్రో ట్వీట్​ చేసింది. ఎల్వీఎం మార్క్–3 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి జులై 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. భూమి చుట్టూ దశలవారీగా కక్ష్యను పెంచుకున్న స్పేస్ క్రాఫ్ట్  ఆగస్టు 1న చంద్రుడివైపు ప్రయాణం ప్రారంభించి 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఆ తర్వాత మరో ఐదుసార్లు కక్ష్యను తగ్గించుకుని 100 కిలోమీటర్ల కక్ష్యలోకి దిగిన తర్వాత 23 నాటికి ల్యాండింగ్ కు సిద్ధం కానుంది.   

ఇకపై ఉపగ్రహంలా ప్రొపల్షన్ మాడ్యూల్ 

చంద్రయాన్–3 మిషన్​లో భాగంగా విక్రమ్ ల్యాండర్​ను, అందులోని ప్రజ్ఞాన్ రోవర్​ను కలిపి చంద్రుడి కక్ష్యకు ప్రొపల్షన్ మాడ్యూల్(పీఎం) మోసుకెళ్లింది. ఎల్​ఎంతో వేరుపడటంతో పీఎం పనిపూర్తయింది. ఇకపై ఇది ఒక ఉపగ్రహంలా చంద్రుడి చుట్టూ అదే కక్ష్యలో తిరుగుతూ భూవాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. కొన్ని సంవత్సరాల వరకు ఇది పని చేయనుందని ఇస్రో వెల్లడించింది.

ఈసారి పక్కా ప్లాన్ తో సిద్ధం 

ఇస్రో 2019లో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్​లో అంతా అనుకున్నట్టే జరిగినా ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఆఖరి నిమిషం లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి.ల్యాండింగ్ టైంలో ల్యాండర్ మాడ్యూల్ స్పీడ్ తగ్గడానికి బదులుగా పెరగడం, సాఫ్ట్ వేర్ ఫెయిల్యూర్​తో ల్యాండర్ క్రాష్ అవడంతో మిషన్ ఫెయిల్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి పక్కా ప్లాన్​తో ఇస్రో రంగంలోకి దిగింది. ల్యాండింగ్ టైంలో స్పీడ్ కంట్రోల్ కాకపోయినా, 4 ఇంజలన్లలో 2 ఫెయిల్ అయినా.. చంద్రుడి నేలను ల్యాండర్ ఎలా తాకినా మిషన్ మాత్రం సక్సెస్ అయ్యేలా ఇస్రో సైంటిస్టులు అన్ని రకాలుగా ప్రయో గాలు చేపట్టి, నిర్ధారించుకున్న తర్వాతే మిషన్​ను ప్రారంభించారు. ‘‘ల్యాండింగ్ ప్రాసెస్​లో సెకనుకు 1.68 కిలోమీటర్ల స్పీడ్ తో ల్యాండర్ దిగాల్సి ఉంటుంది. ముందు గా నిలువుగా కాకుండా సమాంతరంగా ల్యాండర్ దిగుతుంది. వెంటనే 90 డిగ్రీల కోణంలో వాలిపోయి నిట్టనిలువుగా చంద్రుడి ఉపరితలంపైకి దిగాల్సి ఉంటుం ది. ఇలా హారిజాంటల్ నుంచి వర్టికల్ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా లెక్కలు వేశాం” అని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.

విక్రమ్ వర్సెస్ లూనా..ఏది ముందు?

ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దింపేందుకు ఇస్రో రెండో సారి ప్రయత్నం చేస్తుండగా, రష్యా కూడా అనూహ్యంగా రేసులోకి ఎంటరైంది. ఇస్రో జులై 14న చంద్రయాన్–3 మిషన్ ను ప్రారంభించగా.. రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ ఆగస్టు 10న లూనా 25 మిషన్ ను ప్రారంభించి సర్​ప్రైజ్ చేసింది. డైరెక్ట్ రూట్​లో కొద్ది రోజుల్లోనే లూనా 25 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. మిషన్ స్టార్ట్ అయిన11 రోజులకే.. ఈ నెల 21 నుంచి 23 మధ్య ల్యాండింగ్ కు సిద్ధమయింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ముందు గా ఏ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది? విక్రమ్ ల్యాండర్ రికార్డ్ సృష్టిస్తుందా? లూనా 25కే ఆ ఘనత దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.