అడవులు బుగ్గిపాలు.. ములుగు, భూపాలపల్లి జిల్లాలో కాలిపోతున్న అడవులు

అడవులు బుగ్గిపాలు.. ములుగు, భూపాలపల్లి జిల్లాలో కాలిపోతున్న అడవులు
  • ఆకురాలు కాలంలో కనిపించని అప్రమత్తత
  • ఇప్పటికే వందలాది ఎకరాల్లో కాలిన అడవి
  • ఫ్రూనింగ్‌ పేరిట కాంట్రాక్టర్లే నిప్పు పెట్టిస్తున్నారని ఆరోపణ

జయశంకర్‌ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు : పచ్చని అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రతి ఏటా ఎండాకాలంలో అడవులు తగలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అడవి, అటవీ ఉత్పత్తులు కాలి బూడిద అవుతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇటీవల ఎలగడి పడి నిప్పంటుకుంది. దీంతో వందలాది ఎకరాల్లో అడవితో పాటు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లు కాలి బూడిదయ్యాయి. 

ఫ్రూనింగ్‌ పేరిట అడవులకు నిప్పు

భూపాలపల్లి, ములుగు జిల్లా అడవుల్లో ఫ్రూనింగ్‌ పేరిట తునికాకు కాంట్రాక్టర్లు కూలీలతో అడవులకు నిప్పు పెట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తునికాకు టెండర్లు దక్కించుకోవాలనుకునే కాంట్రాక్టర్లు ముందుగా కూలీలతో తునికాకు ఫ్రూనింగ్‌ (కొమ్మ) కొట్టిస్తారు. కొమ్మ కొట్టడం వల్ల సీజన్‌లో తునికాకు చిగురించి క్వాలిటీగా ఉంటుంది. కొమ్మ కొట్టిన అనంతరం కాంట్రాక్టరే నిప్పు పెట్టిస్తున్నారని పలువురు అంటున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గత 10 రోజులుగా అడవులు తగలబడుతున్నాయి. తాడ్వాయి, మహాముత్తారం మండలంలోని అడవులు కాలిపోతున్నాయి. రోజురోజుకు మంటలు విస్తరిస్తుండడంతో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అయినప్పటికీ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. .  

వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు

పచ్చని అడవుల్లో మంటలు ఎగిసి పడుతుండడంతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోంది. దుప్పులు, జింకలు, కుందేల్లు, ఎలుగుబంట్లు, లేళ్లు, నెమళ్లతో పాటు వేలాది జీవాలు ప్రమాదం బారిన పడుతున్నాయి. మంటలు తట్టుకోలేక కోతులు అడవులను విడిచి ఊళ్లోకి వస్తున్నాయి. మంటల్లో చిక్కుకొని కొన్ని జంతువులు చనిపోతున్నాయి. అలాగే గిరిజనుల జీవనాధారమైన అటవీ ఉత్పత్తులు అగ్గి పాలవుతుండడంతో వారు బతుకుదెరువు కోసం వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

అడవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. కానీ మంటల కారణంగా చెట్లన్నీ బుగ్గిపాలవుతున్నాయి. సామాజిక అడవుల విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.