- చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భూత్హీ సీఏఎఫ్ క్యాంప్‌లో ఘటన
భద్రాచలం, వెలుగు : మిర్చీ ఇవ్వలేదన్న కోపంతో జవాన్ల మధ్య మొదలైన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఓ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా భూత్హీ సీఏఎఫ్ (చత్తీస్‌గఢ్ ఆర్డ్మ్ ఫోర్స్) 11వ బెటాలియన్‌లో బుధవారం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు బెటాలియన్‌లోని జవాన్లంతా భోజనాలు చేస్తున్నారు. ఈ టైంలో మిర్చి ఇవ్వాలని అజయ్ సిదర్ అనే జవాన్ భోజనం వడ్డిస్తున్న జవాన్‌ను అడిగాడు. దీంతో అతడు నిరాకరించాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగగా భోజనం వడ్డిస్తున్న జవాన్‌కు గార్డ్ కమాండర్ అంబూజ్ శుక్లా మద్దతుగా నిలిచాడు. అజయ్ సిదర్ భోజనం పూర్తి చేసిన అనంతరం తన రివాల్వర్‌తో అంబూజ్ శుక్లాను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. దీంతో శుక్లా రెండు కాళ్లలోకి, అతడి పక్కనే ఉన్న రూపేశ్ పటేల్, సందీప్‌పాండే శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రూపేశ్ పటేల్ స్పాట్లోనే చనిపోగా, హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో సందీప్ పాండే చనిపోయాడు. గార్డు కమాండర్ అంబూజ్ శుక్లాకు కుస్మీ పీహెచ్సీలో ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం అంబికాపూర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న బలరాంపూర్ ఎస్పీ రాజేశ్ అగర్వాల్ సీఏఎఫ్ క్యాంప్‌కు చేరుకున్నారు. కాల్పులు జరిపిన జవాన్ అజయ్సిదర్ను అదుపులోకి తీసుకొని, ఎంక్వైరీ చేస్తున్నారు.