3.45 లక్షల మందికి సర్ది, జ్వరం

3.45 లక్షల మందికి సర్ది, జ్వరం

హైదరాబాద్​, వెలుగు: కరోనా థర్డ్​ వేవ్​లో చేపట్టిన ఫస్ట్​ రౌండ్​ ఫీవర్​ సర్వే పూర్తయింది. ఈ నెల 21న మొదలైన సర్వే వారం పాటు సాగింది. 21 వేల మందికిపైగా సిబ్బంది.. 77.33 లక్షల ఇండ్లకు వెళ్లారు. 2.7 లక్షల మందికి జ్వరం, దగ్గు, సర్ది వంటి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. ఫీవర్​ సర్వేతో పాటు కొన్ని ఆస్పత్రుల్లో ఫీవర్​ క్లినిక్​లను ఏర్పాటు చేశారు. ఆ క్లినిక్​లకు 5.11 లక్షల మంది రాగా.. 75,101 మందికి కరోనా లక్షణాలున్నట్టు తేల్చారు. ఫీవర్​ సర్వేతోపాటు, ఫీవర్​ క్లినిక్​లకు వచ్చినోళ్లు కలిపి రాష్ట్రంలో 3,45,951 మందికి కరోనా లక్షణాలున్నట్టు ఆరోగ్య సిబ్బంది తేల్చారు. వాళ్లందరికీ కరోనా మెడిసిన్​ కిట్లను పంపిణీ చేశారు. హైదరాబాద్​, కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోనే కరోనా లక్షణాలున్నోళ్లు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ ఆరు జిల్లాల్లోనే 1.23 లక్షల మెడికల్​ కిట్లను సిబ్బంది పంచారు. జనగామ, నారాయణపేట జిల్లాల్లో బాధితులు అతి తక్కువగా ఉన్నారు. ఆ రెండు జిల్లాలు కలిపి కేవలం 8 వేల కిట్లనే పంపిణీ చేశారు. 

రెండో రౌండ్​ షురూ
ఫస్ట్​ రౌండ్​ అయిపోయిందో లేదో సెకండ్​ రౌండ్​ సర్వేని ప్రారంభించాల్సిందిగా హెల్త్​ డిపార్ట్​మెంట్​ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జగిత్యాల, కామారెడ్డి, నాగర్​‌‌కర్నూల్​, నారాయణపేట, నిర్మల్​, వనపర్తి తదితర జిల్లాల్లో శనివారం నుంచి రెండో రౌండ్​ సర్వేని మొదలుపెట్టారు. మిగిలిన జిల్లాల్లో సోమవారం నుంచి ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతుండడంతో మునుపటిలా అన్ని చోట్లా సర్వే చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. కేసులు, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ఊర్లు, ప్రాంతాల్లోనే సర్వే చేయాలని ఆలోచిస్తున్నారు.