యాదాద్రిలో.. తొలి గృహ ప్రవేశం

యాదాద్రిలో.. తొలి గృహ ప్రవేశం
  • లబ్ధిదారుడికి పొట్టేలు, పట్టు బట్టలు అందజేసిన మంత్రి అడ్లూరి, విప్  బీర్ల అయిలయ్య
  • ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​లో యాదాద్రి జిల్లాలో మొదటి ఇల్లు పూర్తి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించిన ఇంటిలో మొదటి గృహ ప్రవేశం జరిగింది. జిల్లా ఇన్​చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య లబ్ధిదారుడికి గొర్రె పొట్టేలు, పట్టు బట్టలను అందజేశారు. యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9,175 ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో 5,980 ఇండ్లు గ్రౌండింగ్​ కాగా, 42 ఇండ్లు స్లాబ్​ లెవల్​కు చేరుకున్నాయి.

యాదగిరిగుట్ట మండలం సైదాపురంలోని లబ్ధిదారులైన ఎగ్గిడి స్వప్న, బాలమల్లేశ్ ఇంటి నిర్మాణం పూర్తయింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య బుధవారం జిల్లా ఇన్​చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ చేతులమీదుగా గృహ ప్రవేశం కార్యక్రమం జరిపించారు. రిబ్బన్​ కట్​ చేయడంతో పాటు ఇంట్లో పాలు పొంగించారు. గతంలో ప్రకటించినట్లుగానే లబ్ధిదారుడికి గొర్రె పొట్టేలు, పట్టు బట్టలను ఆలేరు ఎమ్మెల్యే అందించారు. దీంతో లబ్ధిదారులు అనందంలోమునిగిపోయారు. వారి వెంట కలెక్టర్​  హనుమంతరావు ఉన్నారు. 

సొంతింటి కలను సాకారం చేశాం

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తెలిపారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు డబుల్  బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెబుతూ పేద ప్రజలను మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే పేదోడి సొంతింటి కలను సాకారం చేశామన్నారు. ఇందుకు సైదాపురంలో గృహప్రవేశమే నిదర్శనమని చెప్పారు.