మూడు పార్టీల్లో ఫస్ట్​ లిస్ట్​ రెడీ!.. ఎలక్షన్​ మోడ్​లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ

మూడు పార్టీల్లో ఫస్ట్​ లిస్ట్​ రెడీ!.. ఎలక్షన్​ మోడ్​లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తున్నాయి. అన్ని పార్టీలకన్నా ముందే అధికార పార్టీ బీఆర్ఎస్​ క్యాండిడేట్ల ఫస్ట్​ లిస్ట్​ వారం రోజుల్లో విడుదలయ్యే చాన్స్​ కనిపిస్తున్నది. ఈ నెలాఖరుకే కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల ఫస్ట్​ లిస్టు   ప్రకటించాలని అనుకున్నా కొన్ని కారణాలతో వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. బీజేపీ జాబితా ప్రకటన ఆలస్యమైనా.. సీనియర్ ​లీడర్లందరూ అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనని ఆ పార్టీ హైకమాండ్​ ఇప్పటికే ఆదేశించింది. దీంతో బీజేపీలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్​చివరి వారంలో, లేదా నవంబర్ ​మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్​లోనే ఎన్నికల షెడ్యూల్​ వచ్చే చాన్స్ ​ఉందని మంత్రి కేటీఆర్ ​ఇటీవల తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చెప్పారు. ఏదేమైనా డిసెంబర్​కన్నా ముందే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ​పూర్తవుతుందని పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. 

105 మందితో బీఆర్​ఎస్ ఫస్ట్​ లిస్ట్​?

బీఆర్ఎస్ ​చీఫ్, సీఎం కేసీఆర్ రెండు రోజులుగా ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో పార్టీ అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్ఎస్​ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్​ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్​ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్ లక్కీ నంబర్​అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్​ ఉండొచ్చని చెప్తున్నారు. 


సిట్టింగ్​ ఎమ్మెల్యేల్లో 39 మందిపై వ్యతిరేకత ఉందని, వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న పది నుంచి 15 మంది స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.  సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్​ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టు ఇండికేషన్​ఇచ్చారు. ఇట్ల బీఆర్​ఎస్​ పెద్దలు వేదికలపై ప్రకటించిన పేర్లలో..  గూడెం మహిపాల్​ రెడ్డి (పటాన్​చెరు), గంగుల కమలాకర్​(కరీంనగర్), మాధవరం కృష్ణారావు (కూకట్​పల్లి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆరూరి రమేశ్​ (వర్ధన్నపేట), నల్లమోతు భాస్కర్​ రావు (మిర్యాలగూడ), ధాస్యం వినయ్​భాస్కర్​(వరంగల్​ వెస్ట్), గాదరి కిశోర్​(తుంగతుర్తి), గువ్వల బాలరాజు (అచ్చంపేట), ఆల వెంకటేశ్వర్​రెడ్డి (దేవరకద్ర), శ్రీనివాస్​గౌడ్​(మహబూబ్​నగర్), మంచిరెడ్డి కిషన్​రెడ్డి (ఇబ్రహీంపట్నం), సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), చంటి క్రాంతికిరణ్​(నాగర్​కర్నూల్), బండ్ల కృష్ణమోహన్​రెడ్డి (గద్వాల), ఆశన్నగారి జీవన్​రెడ్డి(ఆర్మూరు), బిగాల గణేశ్​గుప్తా (నిజామాబాద్​అర్బన్), షకీల్​అహ్మద్​(బోధన్), జాజల సురేందర్​(ఎల్లారెడ్డి), ఒడితెల సతీశ్​ కుమార్​ (హుస్నాబాద్) ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి, జాజల సురేందర్​ ఉన్నారు. 

అదేవిధంగా టీడీపీ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన సండ్ర వెంకటవీరయ్య కూడా ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే  11 మందికి టికెట్లపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఇందులో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్​రెడ్డి (పాలేరు), హరిప్రియ నాయక్​(ఇల్లెందు), సుధీర్​రెడ్డి (ఎల్బీ నగర్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), బీరం హర్షవర్ధన్​రెడ్డి (కొల్లాపూర్), పైలెట్​ రోహిత్​ రెడ్డి (తాండూరు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్​)కు టికెట్లు ఖరారైనట్లు బీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగూడెం టికెట్​ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ టికెట్​పై కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వర్​రావు ఆ తర్వాత బీఆర్​ఎస్​లో చేరారు. రెండు రోజుల కింద ఆయన ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్ ను కలిశారు. అయితే.. సర్వేల ఆధారంగా టికెట్​ఇస్తామని, ఎన్నికల కోణంలోనే పని చేసుకోవాలని వనమాతో కేసీఆర్​ అన్నట్లు సమాచారం. వీళ్లు కాకుండా ఇంకో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారు అయినట్టు సమాచారం. కేసీఆర్​సోమవారం వరకు ఫామ్​హౌస్​లోనే ఉండే అవకాశం ఉందని, ఆలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు చెప్తున్నారు.

సెప్టెంబర్​లో కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్ట్

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ టికెట్ల కసరత్తును మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని హైకమాండ్​, రాష్ట్ర స్థాయిలోని పెద్ద లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పీఏసీ సమావేశంలో సునీల్ కనుగోలు 35 సెగ్మెంట్లలో పార్టీ చాలా వీక్​గా ఉందని రిపోర్టు ఇచ్చారు. మొత్తం 119 నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఎలాంటి వివాదాలు లేని 40 మంది అభ్యర్థులను  మొదటి జాబితాలో ప్రకటించనున్నారు. ఈ నెలాఖరుకే 80 మందితో ఫస్ట్​ లిస్ట్​ రిలీజ్​చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే ఇటీవల ప్రకటించినా.. అది సాధ్యం కాకపోవచ్చని గాంధీభవన్​ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఖరారుపై సెప్టెంబర్​ మొదటి వారంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్​లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే మొదటి జాబితా అనౌన్స్​చేయనున్నట్టు తెలుస్తున్నది. పార్టీ టికెట్ల కోసం గాంధీ భవన్​కు ఆశావహులు క్యూ కడుతున్నారు. రిటైర్డ్​ఆఫీసర్లతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంగ్రెస్​ టికెట్లు ఆశిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి తమకు అవకాశం ఇవ్వాలని వాళ్లు కాంగ్రెస్​ పెద్దలను కోరుతున్నారు. 

బీజేపీ ఎంపీలు, సీనియర్లంతా అసెంబ్లీకే..!

బీజేపీ నుంచి లోక్​సభ సభ్యులుగా ఉన్న నలుగురితో పాటు సీనియర్​ నాయకులంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఆ పార్టీ హైకమాండ్ ​ఇప్పటికే  ఆదేశించింది. వీరి పేర్లతోనే మొదటి జాబితా ప్రకటించే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్​ వచ్చిన తర్వాతే తమ  క్యాండిడేట్ల లిస్ట్​ ప్రకటన ఉంటుందని బీజేపీ ముఖ్యులు చెప్తున్నారు. ఎంపీలు, సీనియర్​ లీడర్లు అసెంబ్లీకి పోటీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండికేషన్​ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అంబర్​పేట నుంచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ కరీంనగర్ ​లేదా వేములవాడ నుంచి, ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్​ లేదా కోరుట్ల నుంచి, సోయం బాపూరావు బోథ్ ​నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.  మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి మహబూబ్​నగర్, షాద్​నగర్​లో ఏదో ఒక చోటు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​భువనగిరి నుంచి, మాజీ ఎంపీ విజయశాంతి మల్కాజ్​గిరి ఎంపీ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి, బీజేపీ మధ్యప్రదేశ్​ వ్యవహారాల ఇన్​చార్జ్​ మురళీధర్ ​రావు మల్కాజ్​గిరి లేదా కూకట్​పల్లి నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేలుగా ఉన్న ఈటల రాజేందర్ (హుజూరాబాద్), రఘునందన్​ రావు (దుబ్బాక) నుంచే పోటీ చేయనున్నారు. రాజాసింగ్​సస్పెన్షన్​ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో గోషామహల్​అభ్యర్థిత్వంపై డైలమా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నేతలంతా ఆయా నియోజకవర్గాల్లోని  కేడర్​తో  సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. 

కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్టులో వీళ్లకు చాన్స్

కాంగ్రెస్​ఫస్ట్​లిస్టులో సీనియర్​లీడర్లకు టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి (కొడంగల్​), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (కొత్తగూడెం), కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (నల్గొండ), జానారెడ్డి/జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్​), రఘువీర్​ రెడ్డి (మిర్యాలగూడ), ఉత్తమ్ కుమార్​రెడ్డి (హుజూర్​నగర్​), పద్మావతి (కోదాడ), సీతక్క (ములుగు), కొండా సురేఖ (వరంగల్​ఈస్ట్​), చిన్నారెడ్డి (వనపర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్​), వంశీచంద్ రెడ్డి (కల్వకుర్తి), సంపత్​కుమార్ (ఆలంపూర్​), జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (ఆందోల్​), మహేశ్​కుమార్ గౌడ్ (నిజామాబాద్​ అర్బన్​)​, షబ్బీర్​అలీ (కామారెడ్డి), జీవన్ రెడ్డి (జగిత్యాల), శ్రీధర్​బాబు (మంథని), పొన్నం ప్రభాకర్​ (కరీంనగర్​), పొదెం వీరయ్య (భద్రాచలం), బల్మూరి వెంకట్​ (హుజూరాబాద్​) పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. నాగార్జునసాగర్​ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు. గిరిజన చైతన్య యాత్ర పేరిట నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈసారి నాగార్జునసాగర్​ టికెట్​జైవీర్​రెడ్డికేనని ఒకవైపు..  జానారెడ్డికే చాన్స్​ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్​ఉందని మరోవైపు ప్రచారం జరుగుతున్నది. 

గజ్వేల్​ నుంచే కేసీఆర్​ పోటీ!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్​ నుంచే కేసీఆర్​ పోటీ చేయబోతున్నారని మంత్రి హరీశ్​రావు క్లియర్​ ఇండికేషన్ ​ఇచ్చారు. శుక్రవారం గజ్వేల్​నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ​నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ను వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ​ఈసారి గజ్వేల్​లో కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ ​గంప గోవర్ధన్ ​ఇటీవల మాట్లాడుతూ.. కేసీఆర్​ను కామారెడ్డిలో పోటీ చేయాలని తానే ఆహ్వానించానని చెప్పారు. కేసీఆర్ ​కామారెడ్డిలో పోటీ చేస్తే తన భవిష్యత్ ​ఏమిటనేది ఆయనే నిర్ణయిస్తారని కూడా గోవర్ధన్​ అన్నారు. ఇంకోవైపు గజ్వేల్​లో పోటీ చేయడానికి ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ​చైర్మన్​ ఒంటేరు ప్రతాప్​రెడ్డి కూడా ప్రయత్నాలు షురూ చేశారు. వీటన్నింటికీ తెరదించుతూ ఒంటేరు ప్రతాప్​రెడ్డి సమక్షంలోనే కేసీఆర్​ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని హరీశ్​ పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్​ నియోజకవర్గ మార్పుపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.