ఫస్ట్​టైమ్​ 13 మంది అసెంబ్లీకి..తొలిసారి అసెంబ్లీ బరిలోనిలిచి గెలిచిన మాజీ ఎంపీ వివేక్

ఫస్ట్​టైమ్​ 13 మంది అసెంబ్లీకి..తొలిసారి అసెంబ్లీ బరిలోనిలిచి గెలిచిన మాజీ ఎంపీ వివేక్
  •     పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి విజయం
  •     మంత్రి ఎర్రబెల్లిని మట్టికరిపించిన యశస్విని
  •     మెదక్​లో పద్మా దేవేందర్​రెడ్డిపై రోహిత్ రావు విక్టరీ
  •     సిట్టింగ్​లను ఓడించిన జైవీర్​రెడ్డి, పర్ణికారెడ్డి

హైదరాబాద్, వెలుగు :  తొలిసారి టికెట్ దక్కించుకున్న వారిలో 13 మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ లిస్ట్​లో కొందరు ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లయితే.. మరికొందరు ఎన్నికల్లోనే ఫస్ట్ టైం బరిలో నిలిచి.. గెలిచారు. 2009లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన వివేక్ వెంకటస్వామి.. ఫస్ట్ టైం చెన్నూరు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆ స్థానం నుంచి ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్​ను చిత్తుగా ఓడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి బరిలోనే 37,515 ఓట్ల మెజారిటీతో వివేక్​ వెంకటస్వామి విజయం సాధించారు. గతంలో ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలబడ్డారు. పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని 46,733 ఓట్ల తేడాతో ఓడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్​రెడ్డి కూడా తొలిసారి ఆ పార్టీ నుంచే జనగామ బరిలో నిలబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై 15783 ఓట్లతో గెలిచారు.

ఫస్ట్ టైం యంగ్ ఎమ్మెల్యేలు

తొలిసారి బరిలో నిలిచి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న యంగ్ ఎమ్మెల్యేలుగా మైనంపల్లి రోహిత్ రావు, యశస్విని రెడ్డి, పర్ణికా రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. మెదక్ నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ రావు.. అక్కడి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని 10,157 ఓట్ల తేడాతో ఓడించారు.

ఇటు తన అత్త హనుమండ్ల ఝాన్సీ రెడ్డికి సిటిజన్​షిప్ ప్రాబ్లమ్ రావడంతో.. ఆమె స్థానంలో యశస్విని రెడ్డికి పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఓటమంటూ ఎరుగని, వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆమె మట్టికరిపించారు. 47 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఆమె ఎర్రబెల్లి దయాకర్​రావు మీద విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. నారాయణపేట నుంచి కాంగ్రెస్ బరిలో నిలిచిన చిట్టెం పర్ణికారెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాజేందర్ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

వారసుల ఫేట్ ఇట్ల..

నాగార్జున సాగర్​లో తొలిసారి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు జైవీర్​రెడ్డి.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్​ను 55,849 ఓట్ల తేడాతో చిత్తు చేశారు. తన తండ్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో కంటోన్మెంట్​ టికెట్​ను దక్కించుకున్న లాస్య నందిత.. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్​ను 17,169 ఓట్ల తేడాతో ఓడించారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్​ టికెట్​పై బరిలో నిలిచిన గద్దర్​ కూతురు జి.వి.వెన్నెల మూడో స్థానానికి పరిమితమయ్యారు. నాగర్​కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి కొడుకు రాజేశ్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్​రెడ్డిని 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.    

చివరి నిమిషంలో టికెట్​దక్కించుకొని

అలంపూర్ బీఆర్ఎస్ టికెట్​ను చివరి నిమిషంలో దక్కించుకున్న విజేయుడు.. కాంగ్రెస్​ అభ్యర్థి సంపత్​ కుమార్​పై 30,573 ఓట్ల తేడాతో గెలుపొందారు. వాస్తవానికి తొలి జాబితాలో అలంపూర్ టికెట్​ను తొలుత బీఆర్ఎస్​ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అబ్రహాంకే కేటాయించినా.. చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబట్టి మరీ మార్పించి విజేయుడుకు టికెట్ వచ్చేలా చేశారు. విజేయుడు తొలిసారి పోటీలోనే సంపత్​ను ఓడించారు. మట్టా దయానంద్​కు కాస్ట్ సర్టిఫికెట్​కు సంబంధించిన సమస్యలు రావడంతో ఆయన భార్య మట్టా రాగమయికి కాంగ్రెస్ టికెట్​ను కేటాయించింది.

డాక్టర్ అయిన ఆమె తొలిసారి సత్తుపల్లి నుంచి పోటీ చేశారు. ఆమె అక్కడి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను 18,475 ఓట్ల తేడాతో ఓడించారు. వనపర్తి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘా రెడ్డి.. ప్రస్తుత మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని 25,320 ఓట్ల తేడాతో ఓడించారు.