ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉచిత చేప పిల్లలను వెనక్కి  పంపిన మత్స్యకారులు 

బెల్లంపల్లిరూరల్​​, వెలుగు: నెన్నెల మండల కేంద్రంలోని కుమ్మరివాగు ప్రాజెక్టులో బుధవారం మత్స్యశాఖ అధికారులు, ఎంపీపీ రమాదేవితో కలిసి ఉచిత చేప పిల్లలను వదిలేందుకు వచ్చిన అధికారులకు చుక్కెదురైంది. మొదట 20 వేల చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలారు. నాణ్యమైన చేప పిల్లలు కాకపోవడంతో మత్స్యకారులు నిలిపివేశారు. 60 లక్షల నాణ్యమైన మూడు రకాల చేప పిల్లలను వదలాల్సి ఉండగా సైజు తక్కువ ఉన్న పిల్లలు రావడంతో ఈ చేప పిల్లలు వద్దని మత్స్యకారులు వెనక్కి పంపారు. ఇప్పటికే చేప పిల్లలు వేసే సమయం  దాటిందని  నాసిరకం చేప పిల్లలు వేస్తే ఏం లాభమని అధికారులను మత్స్య సహకార సంఘం సభ్యులు ప్రశ్నించారు. కవర్లలో తెచ్చిన చేప పిల్లల సంఖ్య తక్కువగా ఉందని, పైగా మేలు రకం ఇవ్వకపోవడంతో చేప  పెరుగుదల ఉండది మత్స్యకారులు ఆరోపించారు. ‘వాపస్​ వెళ్తే తిరిగి మీకు చేపల పంపిణీ జరగదని ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదని ఉచితంగా ఇస్తే మీకు ఎందుకింత’ అని  అధికారులు బెదిరించారని మత్స్యకారులు చెప్పారు. ఇప్పటికైనా నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయాలని వారు కోరారు. 


గోవాకు వీవీప్యాట్ల తరలింపు:కలెక్టర్ రాహుల్ రాజ్

ఆసిఫాబాద్, వెలుగు : ఎన్నికల సంఘం ఆదేశాలతో స్థానిక గోదాం నుంచి 284 వీవీ ప్యాట్లను గోవాకు తరలించామని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదాంను అడిషనల్ కలెక్టర్ రాజేశం, వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో కలెక్టర్​ బుధవారం తెరిచారు. అవసరమైన ఈవీఎంలను, వీవీప్యాట్లను తరలించామని చెప్పారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ రామ్మోహన్, ఎన్నికల డీటీ జితేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే:ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత 

ఆదిలాబాద్, వెలుగు : రైతు  ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ఆరోపించారు. బుధవారం బేల మండల కేంద్రంలో పోరు బాట చేపట్టి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, జిల్లా ఇన్​చార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ హాజరై ఎడ్ల బండిపై  తహసీల్దార్ రామ్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అందజేశారు. రైతులకు రుణమాఫీ తో పాటు సబ్సిడీ, ధరణి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సామ రూపేశ్​ రెడ్డి పాల్గొన్నారు. 

బెల్లంపల్లి :  పట్టణంలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్త మారి సూరిబాబు, డీసీసీ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రెటరీ గెల్లి జయరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేయగా.. మాజీమంత్రి గడ్డం వినోద్, నియోజక వర్గ ఇన్​చార్జి చిలుముల శంకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి ప్రభాకర్ యాదవ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రొడ్డ శారద ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ తీసి,  సబ్ కలెక్టర్ ఆఫీస్​ ఎదుట ధర్నా 
నిర్వహించారు. 


బండి’పాదయాత్రలో జన సందడి

భైంసా/కుభీర్​, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ భైంసా మండలం గుండెగాం నుంచి బుధవారం మొదలు పెట్టిన పాదయాత్రలో జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 10.40 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయింది. గుండెగాంలోని ముంపు బాధితులతో రచ్చబండ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ సమస్యను పరిష్కారిస్తామన్న సీఎం కేసీఆర్​, టీఆర్​ఎస్​ లీడర్లు ఇప్పటి వరకూ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు. ప్రతి వర్షకాలంలో ఇండ్లు మునిగిపోతున్నాయని, వర్షకాలం వచ్చిందంటే వణికిపోతున్నామని బాధపడ్డారు. అంతకు ముందు పాదయాత్ర మార్గ మధ్యలో వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలపై సంజయ్​ ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అందరికీ పని దొరుకుతోందని వారికి వివరించారు. అనంతరం యువకులతో మాట్లాడారు. గుండెగాం, మహగాం, చాత గ్రామాల్లో స్థానికులు నీరాజనాలు పలికారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ 

కాగజ్ నగర్,వెలుగు:  పట్టణం లోని టీచర్స్ కాలనీ కి చెందిన అయేషా తంకిన్  ఇంట్లో దొంగలు పడి లక్షా ఎనభై ఏడు వేల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. గత కొన్ని రోజుల కింద ఆ మహిళ తన ఇంటికి తాళం వేసి, ఊరెళ్లింది. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. దొంగలు పడినట్లు గుర్తించి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ రవీందర్  ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు కేసు నమోదు చేసుకున్నారు.