కేవలం కెమికల్స్‌‌‌‌‌‌‌‌, వెల్లుల్లి పొట్టు..అల్లంవెల్లుల్లి లేకుండానే పేస్ట్‌‌‌‌‌‌‌‌ తయారీ

కేవలం కెమికల్స్‌‌‌‌‌‌‌‌, వెల్లుల్లి పొట్టు..అల్లంవెల్లుల్లి లేకుండానే పేస్ట్‌‌‌‌‌‌‌‌ తయారీ
  • రసాయనాలు, వెల్లుల్లి పొట్టు కలిపి రెడీ చేస్తున్న వ్యక్తులు
  • హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌గా రూ. 15కే అమ్మకం
  • ఐదుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌, 250 కిలోల పేస్ట్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్న గద్వాల పోలీసులు

గద్వాల, వెలుగు : అల్లంవెల్లుల్లి వాడకుండా కేవలం కెమికల్స్‌‌‌‌‌‌‌‌, వెల్లుల్లి పొట్టు కలిపి పేస్ట్‌‌‌‌‌‌‌‌గా తయారు చేసి అమ్ముతున్న వ్యక్తులను గద్వాల పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను గద్వాల సీఐ శ్రీనివాసులు, టౌన్‌‌‌‌‌‌‌‌ ఎస్సై కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు. గద్వాల టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు శుక్రవారం పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో వెహికల్స్‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేస్తూ అటువైపు వచ్చిన బొలెరో వాహనాన్ని ఆపారు.

అందులో శ్రీవాసవి, డైమండ్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్ల పేరుతో అల్లంవెల్లుల్లి కాటన్లు కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెహికల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించడంతో కల్తీ గుట్టు బయటపడింది.

కెమికల్స్‌‌‌‌‌‌‌‌తో అల్లంవెల్లుల్లి పేస్ట్‌‌‌‌‌‌‌‌

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌‌‌‌‌కు చెందిన శివ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కాటేదాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇక్బాల్‌‌‌‌‌‌‌‌ రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో రూపనిస్‌‌‌‌‌‌‌‌ డైమండ్‌‌‌‌‌‌‌‌ మ్యానుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ, గద్వాల పట్టణంలోని గంజిపేట కాలనీకి చెందిన ఖాజా అమీర్‌‌‌‌‌‌‌‌ సితార ఇండస్ట్రియల్స్‌‌‌‌‌‌‌‌ అనే షాపులను నిర్వహిస్తున్నారు. వీరు అంజన్‌‌‌‌‌‌‌‌ టాక్స్, టైటానియం డయాక్సైడ్, అక్సంతం గమ్‌‌‌‌‌‌‌‌తో వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన పేస్ట్‌‌‌‌‌‌‌‌ను నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి జిల్లా ఘట్కేసర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు.

ఈ పేస్ట్‌‌‌‌‌‌‌‌ను హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులకు రూ. 15లకు కేజీ చొప్పున అమ్మేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని చాలా షాపులకు ఈ పేస్ట్‌‌‌‌‌‌‌‌ను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 250 కిలోల నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌‌‌‌‌‌‌‌, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.