వరంగల్‍ రైల్వే స్టేషన్లలో పిల్లల కిడ్నాపర్ల అరెస్ట్

వరంగల్‍ రైల్వే స్టేషన్లలో పిల్లల కిడ్నాపర్ల అరెస్ట్
  • అనాథ చిన్నారులను ఎత్తుకెళ్లి అమ్ముతున్న నిందితులు 
  • ఐదుగురు పిల్లలను రెస్క్యూ చేసిన వరంగల్ పోలీసులు

వరంగల్‍, వెలుగు:  రైల్వే స్టేషన్లలో పిల్లలను ఎత్తుకెళ్తున్న ఇద్దరిని వరంగల్‍ కమిషనరేట్‍ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ శనివారం ప్రెస్‍మీట్‍ లో వివరాలు వెల్లడించారు.  గత డిసెంబర్‍ 28న కాజీపేట రైల్వే స్టేషన్‍ బయట ఫుట్‍పాత్‍పై నిద్రించిన కన్నా నాయక్‍ కొడుకు మల్లన్న(5 నెలలు)ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. తండ్రి ఫిర్యాదుతో కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీమ్ ఎంక్వైరీలో భాగంగా నిఘా పెట్టింది. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‍ గ్రామానికి చెందిన కొడుపాక నరేశ్(42), పెద్దపల్లి టౌన్‍ శాంతినగర్‍కు చెందిన వేల్పుల యాదగిరి(32), అద్దె కారులో వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‍ వద్ద రెక్కీ వేశారు. 

అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కిడ్నాపైన బాలుడు మల్లన్నతో పాటు మరో నలుగురు పిల్లలను కిడ్నాప్‍ చేసినట్టు తేలింది. రైల్వే స్టేషన్ల వద్ద నిద్రించేవాళ్లను టార్గెట్‍ గా చేసుకుని, అనాథ పిల్లలను ఎత్తుకెళ్లి పిల్లల్లేని దంపతులకు అమ్ముతూ భారీగా డబ్బులు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. చిన్నారి మల్లన్నను ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లెకు చెందిన దంపతులకు విక్రయించారు.

 గత ఆగస్టులో వరంగల్‍ రైల్వే స్టేషన్‍ ఫ్లాట్‍ ఫామ్ పై 10 నెలల పాపను కిడ్నాప్ చేసి మంచిర్యాల జిల్లా నస్పూర్‍లో, 2023 అక్టోబర్‍ లో కాజీపేట రైల్వే స్టేషన్‍ ఫ్లాట్‍ఫామ్ పై 3 ఏండ్ల బాలుడిని ఎత్తుకెళ్లి జన్నారం మండలంలో, గత అక్టోబర్‍ లో మంచిర్యాల రైల్వే స్టేషన్‍ వద్ద 5 నెలల పాపను కిడ్నాప్ చేసి మంచిర్యాల ఏరియాలో, గత  జూన్‍ లో రామగుండం రైల్వే స్టేషన్‍ వద్ద 10 నెలల పాపను తీసుకెళ్లి జగిత్యాల జిల్లాలో నిందితులు అమ్ముకున్నట్టు ఒప్పుకున్నారు. 

పోలీసులు ఐదుగురు పిల్లలను రెస్క్యూ చేశారు. కొనుగోలు చేసిన దంపతులను అరెస్ట్ చేశారు.  కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసు సిబ్బందిని సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ రివార్డులతో సన్మానించారు. ఈ సమావేశంలో సెంట్రల్‍ జోన్‍ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీలు మధుసూదన్‍, ప్రశాంత్‍రెడ్డి, కాజీపేట ఇన్ స్పెక్టర్‍ సుధాకర్‍రెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్‍ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.