కటారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష

కటారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష
  • చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు
  • 2015 నవంబర్​ 17న ఘటన
  • ఆఫీస్​లోకి చొరబడి కత్తులతో పొడిచి మాజీ మేయర్ దంపతుల హత్య
  • దోషి చింటూకు మరణ శిక్ష, రూ.70 లక్షల జరిమానా


    
హైదరాబాద్: ఏపీలోని చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్  హత్య చేసిన కేసులో దోషులకు చిత్తూరు జిల్లా సెషన్స్  కోర్టు మరణశిక్ష విధించింది. దోషులు శ్రీరాం చంద్రశేఖర్ (కటారి మోహన్  మేనల్లుడు) అలియాస్  చింటూ (ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటచలపతి అలియాస్  వెంకటేశ్, జయప్రకాశ్ రెడ్డి అలియాస్  జయరెడ్డి, మంజునాథ్  అలియాస్  మంజు, మునిరత్నం వెంకటేశ్ కు జిల్లా సెషన్స్  కోర్టు జడ్జి ఎన్.శ్రీనివాసరావు మరణశిక్ష విధిస్తూ ఇటీవలే తీర్పు చెప్పారు. 2015 నవంబరు 17న దోషులు చిత్తూరు మునిసిపల్  కార్పొరేషన్  ఆఫీసుకు బురకా వేసుకుని వచ్చారు. నాటి మేయర్  కటారి అనురాధ చాంబర్ లోకి చొరబడి అనురాధతో పాటు ఆమె భర్త మోహన్​ను  కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తర్వాత అనురాధను కాల్చి చంపారు.

 అలాగే వేలూరి సతీశ్ కుమార్  నాయుడుపైనా దాడి చేశారు. కుటుంబ వివాదంతోనే ఈ హత్యలు చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కటారి మోహన్ కు చింటూ మేనల్లుడు అవుతాడు. వారి మధ్య వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక విభేదాలు వచ్చాయి. దీంతో కటారి మోహన్, ఆయన భార్య అనురాధను హత్య చేయాలని చింటూ కుట్రపన్నాడు. చింటూకు కోర్టు మరణశిక్షతో పాటు రూ.70 లక్షల జరిమానా కూడా విధించింది. అందులో రూ.50 లక్షలు కటారి దంపతుల వారసులకు, గాయపడిన వేలూరి సతీశ్  కుమార్ కు రూ.20 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కాగా.. కోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. కోర్టు ఆవరణ అంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు బయట జనం గుమిగూడకుండా, ర్యాలీలు జరపకుండా నిషేధాజ్ఞలు విధించారు.