కరోనా ఆస్పత్రిలో మంటలు.. ఐదుగురు పేషెంట్లు మృతి

కరోనా ఆస్పత్రిలో మంటలు.. ఐదుగురు పేషెంట్లు మృతి
  • చత్తీస్‌‌గఢ్‌‌లో ఘటన

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఘోరం జరిగింది. కరోనా ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఐదుగురు పేషెంట్లు మృతి చెందారు. రాజధాని సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. ‘‘కరోనా వార్డులో శనివారం సాయంత్రం 4:30 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల్లో కాలిపోయి ఒకరు, ఊపిరాడక నలుగురు చనిపోయారు” అని పోలీసులు ఆదివారం తెలిపారు. ‘‘సూపర్ వైజర్ మంటలు చెలరేగడం గుర్తించి, మేనేజ్మెంట్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన టైమ్ లో వార్డులో దాదాపు 30 మంది పేషెంట్లు ఉన్నారు. ఫైర్ సిబ్బంది, హాస్పిటల్ స్టాఫ్ కలిసి మిగతా పేషెంట్లను రక్షించారు. ఫైర్ సిబ్బంది 20 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు” అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగిందన్నారు. హాస్పిటల్ మేనేజ్ మెంట్ పై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని రాయ్ పూర్ కలెక్టర్ ఎస్.భారతి దాసన్ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 
బాధిత కుటుంబాలను ఆదుకోండి: రాహుల్ 
కరోనా పేషెంట్ల మృతికి కాంగ్రెస్‌ లీడర్‌ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. ‘‘ఐసీయూలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న కరోనా పేషెంట్లు అగ్నిప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు.