రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో అధికారులు, మ్యాక్స్ సంఘాల అలసత్వం వల్ల అయిదు వేల మంది పవరూ లూం కార్మికులకు దాదాపు రూ.20 కోట్ల యూరన్ (నూలు) సబ్సిడీ అందడం లేదు. బతుకమ్మ చీరల ఉత్పత్తి కార్మికులకు యూరన్ సబ్సిడీని మూడేళ్ల నుంచి ప్రభుత్వం పెండింగ్ ఉంచుతోంది. మరో వైపు కార్మికుల వివరాలను చేనేత జౌళిశాఖకు ఆసాములు వివరాలు ఇవ్వకపోవడం వల్లనే లేట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
కూలీ పెంచకుండా సబ్సిడీ ఇచ్చారు
సిరిసిల్లలో బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తి లో పని చేస్తున్న పవర్ లూం కార్మికులు 2018లో కూలీ పెంచాలని సమ్మెకు దిగారు. ఒక్కో కార్మికుడు ఎనిమిది సాంచాలపై పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేసేవాడు. ఎన్ని మీటర్లు ఉత్పత్తి చేస్తే అన్ని మీటర్ల బట్టకు కూలీ లభించేది. మామూలు బట్ట అయితే తెల్ల పోగులతో చేస్తారు. కాబట్టి కంటి మీద ఒత్తిడి ఉండదు. బతుకమ్మ చీరలను రంగుల్లో ఉత్పత్తి చేయాలి. ఎనిమిది సాంచాల నుంచి నాలుగు సాంచాలకు తగ్గింది. దీని వల్ల పని భారం పెరిగి ఉత్పత్తి తగ్గడంతో కార్మికులకు కూలీ గిట్టుబాటు కాలేదు. 2018లో కార్మికులు కూలీ రేట్లు పెంచాలని బతుకమ్మ చీరల ఉత్పత్తిని ఆపి సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం కార్మికులకు తో చర్చలు జరిపింది. కూలీ పెంచడం సాధ్యం కాదని కానీ కార్మికులు ఉత్పత్తి చేసిన బట్టకు నూలు రాయితీ ఇస్తామని ప్రకటించిండ్రు. ఒక్కో కార్మికుడు ఉత్పత్తి చేసిన బట్టపై మీటరుకు రూ 1. 25 ఇస్తామని చేనేత జౌళిశాఖ అధికారులు ప్రకటించారు.
5 వేల మంది కార్మికుల ఎదురుచూపులు
సిరిసిల్లలో బతుకమ్మ చీరలు నేసిన 5 వేల మంది కార్మికులకు నూలు సబ్సీడీ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో కార్మికుడికి 15 వేల నుంచి 40 వేల వరకు రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. 2018లో కార్మికులు ఉత్పత్తి చేసిన బట్టకు 10 శాతం నూలు రాయితీని 2021లో మూడేండ్లు ఆలస్యంగా వేశారు. 2018లో నాలుగు వేల మంది కార్మికులకు రూ.6.65 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2019 నాటి యారన్ సబ్సిడీని మూడు నెలల కిందట రూ. 8.65 కోట్లు చెల్లించారు. ఇంకా 2020 నుంచి మూడేండ్ల నూలు సబ్సీడీ రీలీజ్ చేయాల్సి ఉంది. మూడేండ్లకు కలిపి దాదాపు రూ. 20 కోట్ల రూపాయలు కార్మికులకు రావాల్సి ఉంది.
పెండింగ్ ఎందుకు పెడుతున్నారంటే..
సిరిసిల్ల కార్మికులు నిలకడగా ఒకే కార్ఖానాలో పని చేయరు. వివిధ కారణాలతో కార్ఖానాలు మారుతుంటారు. 2018 నుంచి యారన్ సబ్సిడీ అమలు కావడంతో ప్రస్తుతం నిలకడగా ఒకే కార్ఖానాలో పని చేస్తున్నారు. మూడేళ్ల కిందట పని చేసిన కార్మికుల వివరాలు, వారు చేసిన ఉత్పత్తి సమాచారం వస్త్రోత్పత్తిదారుల వద్ద సమగ్రంగా లేదు. జియో ట్యాగింగ్ ఆధారంగా సాంచాల వివరాలు, జౌళిశాఖ వద్ద ఉన్నా కార్మికుల సమాచారం లేదు. ఇలా సమగ్రత లేక ఆసాముల పేర్లను కార్మికులుగా పేర్కొంటూ అందించారు. దీంతో కార్మికులకు నష్టం జరుగుతోంది. వస్త్రోత్పత్తి దారులు కార్మికుల వివరాలు ఇవ్వడంలో జాప్యం చేయడంతో నూలు రాయితీ చెల్లింపుల్లో ఆలస్యమవుతోంది.
వివరాలివ్వకుంటే బ్లాక్ లిస్టులో పెట్టాలి
ప్రభుత్వం కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా నూలు సబ్సిడీ ఇస్తోంది. వస్త్రోత్పత్తి దారులు వారి వద్ద పని చేసిన కార్మికుల వివరాలు ఇవ్వడం లేదు. జౌళి శాఖ అధికారులు వివరాలు ఇవ్వని వస్త్రోత్పత్తిదారుల యూనిట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అనంతరం కొత్త ఆర్డర్లను ఇవ్వకపోతే కార్మికులకు వేగంగా నూలు రాయితీ దక్కే ఛాన్స్ ఉంది. తప్పుడు వివరాలిచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇలాంటి చర్యలతో క్షేత్ర స్థాయిలో పని చేసే కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. మంత్రి కేటీఆర్, సిరిసిల్ల కు చెందిన టీపీటీడీసీ చైర్మన్ గుడూరి ప్రవీణ్ జౌళిశాఖ అధికారులకు ఆదేశాలిచ్చి సోసైటీలు కార్మికుల వివరాలు పంపే ప్రయత్నం చేస్తే కార్మికులకు మూడు సంవత్సరాల పెండింగ్ సబ్సిడీ అందుతోంది.