చెరువులో డెడ్​బాడీ ఉందన్న జనాలు..వచ్చి చూస్తే లేచి కూర్చున్నడు

చెరువులో డెడ్​బాడీ ఉందన్న జనాలు..వచ్చి చూస్తే లేచి కూర్చున్నడు
  • చల్లగా ఉంటదని పడుకున్నానన్న మందుబాబు  
  • నివ్వెరపోయిన పోలీసులు, 108 సిబ్బంది 
  • సోషల్​ మీడియాలో వీడియో వైరల్​
  • గ్రేటర్‍ వరంగల్‍లో ఘటన

వరంగల్‍, వెలుగు : పీకల వరకు మందుకొట్టిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఐదు గంటలు చెరువులో పడుకోగా ..ఇది చూసిన స్థానికులు శవం అనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అతడిని లేపుతుండగా ఒక్కసారిగా పైకి లేచి షాక్​ ఇచ్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ రెడ్డికాలనీ యాదవనగర్‍ నుంచి వంగపహాడ్‍ ఔటర్‍ రింగురోడ్‍ చేరుకునే రూట్​లో రెడ్డిపురం కోవెలకుంట చెరువు ఉంది. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు ఒంటిపై షర్ట్​లేకుండా నీళ్లపై తేలియాడుతున్న ఓ వ్యక్తిని చూశారు. చనిపోయాడేమో అనుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

దీంతో పోలీసులు,108 సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ‘ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవనైనా చంపిపడేశారా’ అనే అనుమానంతో పరిశీలించి చూస్తున్నారు. దీన్ని అక్కడున్న వాళ్లు తమ ఫోన్లలో వీడియో తీస్తున్నారు. అంతలో ఓ కానిస్టేబుల్‍ నీళ్లలో ఉన్న వ్యక్తి చెయ్యిపట్టి మెల్లిగా బయటకు లాగే ప్రయత్నం చేయగా అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.  ఏమీ కానందుకు సంతోషించి కుంటలో ఎందుకు పడుకున్నావని అడిగారు. దీనికి సదరు మందుబాబు ‘ మందు తాగాక సల్లదనం కోసం పన్నా’ అని చెప్పాడు.

‘ఐదు గంటలుగా నీళ్లలో ఇట్లనే పడి ఉన్నావ్ ​మునిగిపోతే ఎట్లా’ అని అడిగితే ‘ బండ పట్టుకొని పన్నా సార్ ఏం కాదు​’ అని రిప్లై ఇచ్చాడు.  ‘సార్ రూ.50  ఇస్తే నేను పనిచేసే కాజీపేటకు వెళ్లిపోతా’ అని వారిని బతిమిలాడుకున్నాడు. సదరు మందుబాబును నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.