ఉగ్రరూపం దాల్చిన  ప్రాణహిత

ఉగ్రరూపం దాల్చిన  ప్రాణహిత
  • వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునక

మంచిర్యాల జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. తీరం దాటి పంటపోలాలను వరద ముంచెత్తుతోంది. కోటపల్లి మండలంలోని జనగామ, ఆల్గామ, పుల్లాగామ, సిర్సా, అన్నారం తదితర  గ్రామాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు వేమనపల్లి మండలంలోని రాచర్ల, కళ్లంపల్లి తదితర గ్రామాల్లోనూ పత్తి పంటలు నీటిలో మగ్గుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్తో రివర్స్ వస్తున్న ప్రాణహిత

ఎగువ ప్రాంతంలోని పెనుగంగా, వాగ్దా నది నుంచి ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్  ప్రాణహిత నది ప్రవాహాన్ని వెనక్కి ఎగదోస్తోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్, ప్రాణహిత ఉగ్రరూపం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు ప్రాంతాల వరకు ప్రాణహిత వరద ఉధృతి పెరుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరో వైపు ప్రాణహిత వరద ప్రవాహం పోటెత్తడంతో వేమనపల్లి మండలం సుంపుటం మత్తడి వాగు పొంగిపారుతోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.