గుజరాత్​కు ఎఫ్​డీఐల వరద

గుజరాత్​కు ఎఫ్​డీఐల వరద
  • గత ఆర్థిక సంవత్సరంలో 30 బిలియన్ డాలర్లు
  • తరువాతి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక 

న్యూఢిల్లీ: ఫారిన్​ కంపెనీలు గుజరాత్​కు క్యూ కడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మనదేశానికి  81.72 బిలియన్ డాలర్ల విలువైన ఫారిన్​ డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్లు (ఎఫ్​డీఐలు) రాగా వీటిలో 37 శాతం గుజరాత్​కు వెళ్లాయి. గత సంవత్సరంలో ఈ రాష్ట్రం 30 బిలియన్​ డాలర్ల (దాదాపు రూ.3 మూడు కోట్ల కోట్లు)ఎఫ్​డీలను రాబట్టింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వీటి విలువ 10 శాతం పెరిగిందని కేంద్ర  వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  మహారాష్ట్ర , కర్ణాటక వరుసగా 27 శాతం , 13 శాతం ఎఫ్​డీఐలను ఆకర్షించడం ద్వారా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వరుసగా నాలుగో సంవత్సరం కూడా గుజరాత్ ఎఫ్​డీఐల విషయంలో మొదటి ర్యాంకును సాధించింది. 2020–-21లో గుజరాత్‌‌లో వచ్చిన పెట్టుబడులలో దాదాపు 94 శాతం కంప్యూటర్ హార్డ్‌‌వేర్, సాఫ్ట్‌‌వేర్ రంగంలోనే ఉన్నాయి. మనదేశానికి వచ్చిన మొత్తం ఎఫ్​డీఐలలో ఈ రెండు రంగాల వాటా 78 శాతం ఉంది. డిపార్ట్​మెంట్​ ఫర్​ ది ప్రమోషన్​ ఆఫ్ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ) లెక్కల ప్రకారం  గత ఏడాది మార్చి క్వార్టర్​లో  గుజరాత్ రూ.1.77 లక్షల కోట్ల విలువైన ఎఫ్​డీఐలను రాబట్టింది.అయితే ఈ క్వార్టర్​ రాష్ట్రాల వారీగా ఎఫ్‌‌డీఐ ఇన్‌‌ఫ్లో డేటా ఇంకా అందుబాటులో లేదు. ఇదేకాలంలో మహారాష్ట్ర 1.53 లక్షల కోట్ల రూపాయల  ఎఫ్‌‌డీఐలను సాధించింది. కర్ణాటక 78,160 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి మూడవ స్థానంలో ఉంది.

ఇతర రాష్ట్రాలకు ఎఫ్​డీఐలు ఇలా..

  • ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి -డిసెంబర్ మధ్య రూ.59,830 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.ఏడవ , ఎనిమిదవ స్థానాల్లో నిలిచిన తమిళనాడు, జార్ఖండ్ వరుసగా రూ .19,734 కోట్లు, రూ .19,200 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
  • హర్యానా రూ.13,661 కోట్ల రూపాయల  ఎఫ్డీఐలను సాధించగా, తెలంగాణకు రూ .11,332 కోట్లు, పశ్చిమ బెంగాల్​కు రూ .4,309 కోట్లు, యూపీకి రూ .4,103 కోట్లు వచ్చాయి. 
  • అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం ఎఫ్​డీఐలను 20 శాతం పెంచుకోగలిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా సమస్యలు ఉన్నప్పటికీ, ఇప్పటికే 10 శాతం గ్రోత్​ను సాధించింది.  
  • సింగపూర్ 29 శాతం ఎఫ్​డీఐలతో ఇండియాలో అత్యధికంగా ఇన్వెస్ట్​ చేసిన దేశంగా ఉంది. తరువాతిస్థానాల్లో అమెరికా (23 శాతం), మారిషస్ (9 శాతం) ఉన్నాయి.
  • ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, కంప్యూటర్ సాఫ్ట్‌‌వేర్ , హార్డ్‌‌వేర్, రబ్బరు వస్తువులు, రిటైల్ ట్రేడింగ్, డ్రగ్స్ , ఫార్మాస్యూటికల్స్ , ఎలక్ట్రికల్ పరికరాల సెగ్మెంట్లలో ఎఫ్​డీఐ లు 2020–-21 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 100 శాతానికి పైగా పెరిగాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సౌదీ అరేబియా నుంచి ఎక్కువ ఎఫ్​డీఐలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇది  89.93 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్​ చేయగా ఈసారి వీటి విలువ  2,816.08 మిలియన్​ డాలర్లకు చేరింది. అమెరికా, బ్రిటన్​ కంపెనీల పెట్టుబడులు కూడా గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. 
  • తాజా నివేదిక ప్రకారం, 2020 లో ప్రపంచ ఎఫ్‌‌డీఐ మార్కెట్​  కుప్పకూలింది, 2019 లో 1.5 ట్రిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు రాగా, 2020లో ఇవి 42 శాతం తగ్గి 859 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 1990 తరువాత ఇంత తక్కువగా ఎఫ్​డీఐలు రావడం ఇదే మొదటిసారి.