ఆదిలాబాద్‎లో గోదావరి ఉగ్రరూపం.. 40 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద..!

ఆదిలాబాద్‎లో గోదావరి ఉగ్రరూపం.. 40 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద..!
  • బాసర వద్ద  గోదావరి ఉగ్రరూపం
  • మునిగిన పుష్కరఘాట్లు, జలమయమైన ఆలయ పరిసరాలు
  • 40 ఏండ్ల తర్వాత బాసర ఆలయ సమీపంలోకి చేరుకున్న వరద
  • వేల ఎకరాల్లో మునిగిన పంటలు
  • గోదావరి వద్ద శాంతి పూజలు చేసిన ఆలయ అర్చకులు

భైంసా, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగి బాసరలోని పుష్కరఘాట్లన్నీ మునిగిపోయాయి. ఆలయ సమీపంలోకి, లాడ్జీల్లోకి వరద నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాడ్జీల్లో చిక్కుకున్న వారిని ఆఫీసర్లు, రెస్క్యూ టీమ్స్‌‌ రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. గోదావరి వరద కారణంగా సుమారు వెయ్యి ఎకరాల్లో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి.

40 ఏండ్ల తర్వాత..

బాసర వద్ద గోదావరి నది 40 ఏండ్ల తర్వాత మరోసారి ఉప్పొంగింది. 1984లో భారీ స్థాయిలో వచ్చిన వరద కారణంగా పుష్కరఘాట్లు మునిగి నీరంతా రోడ్డుపై పారింది. ఇప్పుడు మరోసారి గోదావరి పోటెత్తడంతో వరద గంగమ్మ విగ్రహం, శివాలయం దాటి శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ సమీపంలోకి చేరింది. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు ఆలయం నుంచి గోదావరి నది వైపు వెళ్లే మార్గాన్ని మూసేశారు. గోదారమ్మ శాంతించాలంటూ ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, సౌభాగ్య ద్రవ్య సమర్పణ చేశారు.

లాడ్జీల్లోకి చేరిన నీరు

వరద కారణంగా బాసర ఆలయం నుంచి నది వైపు వెళ్లే రోడ్డు జలమయమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న హరిహర కాటేజీ, వడ్డేపల్లి నర్సింగరావు అతిథిగృహం, దీక్షా లాడ్జితో పాటు పలు లాడ్జీల్లోకి నీరు చేరడంతో చాలా మంది చిక్కుకుపోయారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 40 మంది ఎన్డీఆర్‌‌ఎఫ్‌‌ టీమ్‌‌, పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. 

లాడ్జీల్లో భక్తులు చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న ఎస్పీ డాక్టర్‌‌ జానకీ షర్మిల బాసరకు చేరుకొని ట్రాక్టర్‌‌లో లాడ్జీల వద్దకు వెళ్లి భక్తులతో మాట్లాడి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, భోజన వసతి కల్పించారు. అలాగే గోదావరి సమీపంలోని బిల్డింగ్‌‌లో అద్దెకు ఉన్న నలుగురు వరదలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు తెప్పలపై వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా పారుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో ప్రస్తుతం గోదావరిలో 9,32,288 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం శుక్రవారం రాత్రి 7.22 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి పాటిల్‌‌ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

ఎగువ నుంచి ఇంకా వరద వస్తుండడంతో గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌‌ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆఫీసర్లను ఆదేసించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, కొత్తగూడెం, భద్రాచలంలో కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.