
- మరో 100 మందికి గాయాలు.. 69 మంది గల్లంతు
- పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ప్రధాని మోదీ
- నేడు చోసిటి గ్రామానికి సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల సంభవించిన వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. వరదల్లో గల్లంతైన 69 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఇప్పటిదాకా 30 డెడ్ బాడీలను అధికారులు గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది మొత్తం 160 మందిని కాపాడగా..అందులో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెండోరోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం వరదలు సంభవించిన చోసిటి గ్రామం నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న పద్దర్‌లో అధికారులు కంట్రోల్ రూమ్-కమ్-హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ఘటన జరిగినప్పటి నుంచి హెల్ప్ డెస్క్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయని, పలువురు తమ కుటుంబ సభ్యులు తప్పిపోయినట్లు చెప్పారని అధికారులు వెల్లడించారు. కాల్స్ ఆధారంగా 69 మంది ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సెర్చ్ ఆపరేషన్ కష్టంగా మారిందన్నారు.కిష్త్వార్ లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయడంలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ తోపాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమైంది.
సహాయ కార్యక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా..
జమ్మూకాశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. "కిష్ట్వార్‌లో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి గురించి ఈ రోజు నేను జమ్మూ కాశ్మీర్ ఎల్‌జీ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడాను. అధికారులు ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్‌కు కావాల్సిన సాయం అందజేస్తాం" అని ప్రధాని ట్వీట్ చేశారు.
వరదలు సంభవించిన చోసిటి గ్రామాన్ని సీఎం శనివారం సందర్శిస్తారు. పరిస్థితులపై రివ్యూ నిర్వహించి ఆ ప్రాంతం లో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నా రు. కాగా.. జమ్మూలో గురువారం క్లౌడ్ బరస్ట్ జరిగి భారీ వర్షం కురిసింది. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించిన మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులను ముంచెత్తింది. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకు పోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్ మాతా దేవి యాత్రను నిలిపివేశారు.