మహిళ అకౌంట్ లో 30కోట్లు వేసిన అజ్ఞాతవాసి

మహిళ అకౌంట్ లో 30కోట్లు వేసిన అజ్ఞాతవాసి

చెన్నపట్నానికి చెందిన సయ్యద్ మాలిక్ అతని భార్య బుర్హాన్ లు పూల వ్యాపారం చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. బుర్హాన్ అనారోగ్యంతో బాధపడుతుండగా..మాలిక్ ఆమెకు వైద్యం చేయించేందుకు డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో బుర్హాన్ ఆన్ లైన్ లో ఓ చీర కొనుగోలు చేసింది. చీర కొన్న వారం రోజుల ఓ వ్యక్తి ఫోన్ చేసి చీరపై లాటరీ తగిలిందని, బీమాకింద ఓ 6లక్షలు అకౌంట్ లో జమచేయాలని అన్నాడు. అందుకు మాలిక్ తాము పేదవాళ్లమని భార్య ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు కావాలని సదరు వ్యక్తిని కోరాడు.

అయితే ఇదే క్రమంలో అంటే డిసెంబర్ 2న బ్యాంక్ అధికారులు సయ్యద్ అడ్రస్ వెతుక్కుంటూ బ్యాంక్ అధికారులు వచ్చారు. బుర్హాన్ బ్యాంక్ అకౌంట్ లో 30కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఆధార్ కార్డ్ తో బ్యాంక్ కు రావాలని సూచించారు. అయితే తన అకౌంట్ లో అంతడబ్బు ఎలా వచ్చిందో తెలియదని, భార్యకు వైద్యం చేయించేందుకు డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నట్లు బ్యాంక్ అధికారులకు చెప్పాడు.

అనంతరం మాలిక్  పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న  రామనగర జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ అకౌంట్ లో డబ్బులు ఎలా వచ్చాయో విచారణ జరిపిస్తున్నామని, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేసిన అజ్ఞాతవాసి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.