
హైదరాబాద్, వెలుగు: ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సీసీబీ) సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ వద్ద తన రెండో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఇందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం రూ.600 కోట్లు, మున్ముందు మరో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. 300 మందికి జాబ్స్ ఇస్తామని తెలిపింది. అంతేగాక నీరు, ఘన వ్యర్థాల నిర్వహణకు, లోకల్ యూత్‌కు ఉపాధి అవకాశాల కల్పనకు, నైపుణ్యాల నిర్మాణానికి 10 వేల మందికి ట్రైనింగ్ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంది. లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ఆటోమేటెడ్ పద్ధతిలో స్మార్ట్ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక్కడ జ్యూస్ లు, ఎన్‌హేన్స్‌డ్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్, స్పార్క్లింగ్ బేవరేజెస్‌ను తయారు చేస్తుంది. సాణంద్ (గుజరాత్), రాణినగర్ (పశ్చిమ బెంగాల్)లలోని రెండు కొత్త ఫ్యాక్టరీలలో వరుసగా 40 శాతం మంది, 65శాతం మంది మహిళలు పని చేస్తున్నారు. తిమ్మాపూర్ ఫ్యాక్టరీలోనూ 50 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. 2023 చివరి నాటికి ఇక్కడ ప్రొడక్షన్ మొదలవుతుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసి) ఇప్పటికే ఈ ఫుడ్ పార్క్ లో హెచ్‌సీసీబీకి 48.53 ఎకరాల జాగా ఇచ్చింది. మంత్రి కేటీఆర్, ఈశాఖల ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్ రంజన్, కోకా-కోలా కంపెనీ బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రొడ్రిగ్జ్, హెచ్‌సీసీబీ చైర్మన్ సీఈఓ నీరజ్ గార్గ్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. హెచ్‌సీసీబీకి ఇది వరకే అమీన్ పూర్ లో మెగా ఫ్యా క్టరీ ఉంది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘‘హెచ్‌సీసీబీ ఈ ఏడాది తన 25వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లుగా సంస్థ ప్రకటించింది. ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ కోసం వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల రాష్ట్రంతో హెచ్‌సీసీబీ సంబంధాలు మరింత బలపడతాయి. తెలంగాణలో వ్యాపార నిర్వహణ సులభం కాబట్టే హెచ్‌సీసీబీ వంటి పెద్ద కార్పొరేషన్ రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెడుతున్నాయి. మా పారిశ్రామిక విధానాలు ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. మేం అనుసరిస్తున్న విధానాల కారణంగానే తెలంగాణ యావత్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద, ప్రఖ్యాత కార్పొరెట్ సంస్థలకు నిలయంగా మారింది. తిమ్మాపూర్ ఫ్యాక్టరీలో సగం జాబ్స్ మహిళలకే ఇస్తారు. లోకల్ ట్యాలెంట్‌ను, ప్రొడక్టులను వాడుకోవాలని కోరుతున్నాను. జ్యూస్‌ల తయారీకి మీరు జగిత్యాల నుంచి మామిడిపండ్లను కొనుక్కోవచ్చు. నల్గొండ బత్తాయిలకు ఫేమస్. మా ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తోంది. రైతుల ఆదాయం పెంచడం మా టార్గెట్’’ అని అన్నారు. హెచ్‌సీసీబీ చైర్మన్, సీఈఓ నీరజ్ గార్గ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రాష్ట్రం నుంచి మాకు ఎంతో సపోర్ట్ దొరుకుతున్నది. 2023లోగా ఫ్యాక్టరీని తెలంగాణ ప్రజలకు అంకితం ఇస్తాం. ఇక్కడ స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వంతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదరడంపై ఎంతో సంతోషంగా ఉన్నాం. మా సంస్థ మొదటి నుంచి నీటి పొదుపునకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ తో సహా ఘనవ్యర్థాలను క్లీన్ చేస్తున్నాం. మా కెరీర్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాం”అని వివరించారు. కోకా- కోలా కంపెనీ బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ సీసీఓ జువాన్ పాబ్లో రొడ్రిగ్జ్మాట్లాడుతూ భారతదేశవ్యాప్తంగా 25 లక్షల మొక్కలను నాటుతున్నామని చెప్పారు.