హైదరాబాద్ సెగ్మెంట్​లో టఫ్ ఫైట్ .. మజ్లిస్​కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్

హైదరాబాద్ సెగ్మెంట్​లో టఫ్ ఫైట్ .. మజ్లిస్​కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్
  • ఎంఐఎం కంచుకోటను బద్దలుకొట్టేలా వ్యూహాలు
  • బీజేపీ నుంచి బరిలో మాధవీలత
  • హిందుత్వ నినాదంతో ఢీకొట్టే ప్రయత్నం
  • బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌‌ యాదవ్‌‌కు టికెట్
  • మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్
  • భారీగా చీలనున్న మజ్లిస్ వ్యతిరేక ఓటు

హైదరాబాద్‌‌, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​పైనే ఫోకస్ పెట్టాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు షురూ చేశాయి. పాతబస్తీలో తమకు ఎదురే లేదని భావిస్తున్న ఎంఐఎంను ఎదుర్కొనేందుకు బీజేపీ అందరి కంటే ముందే మహిళా అభ్యర్థి మాధవీ లతను రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వ్యూహాన్నే అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ లోక్​సభ సెగ్మెంట్​లో యాదవ సామాజిక వర్గానికి చెందినవాళ్లు ఎక్కువగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్‌‌‌‌ యాదవ్​ను బరిలో దించింది.

హైదరాబాద్ సెగ్మెంట్​లో మజ్లిస్​దే హవా

హైదరాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ స్థానం ఎంఐఎం అడ్డాగా మారింది. 1984 నుంచి 2024 వరకు నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్నది. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్‌‌‌‌ ఒవైసీ 1984 నుంచి 2004 వరకు 20 ఏండ్ల పాటు ఎంపీగా కొనసాగారు. తర్వాత 2004 నుంచి వరుసగా ఇప్పటిదాకా అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. మళ్లీ హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి మజ్లిస్ పార్టీ తరఫున అసదుద్దీన్ ఒవైసీ బరిలో దిగుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు మజ్లిస్​కు గట్టి పోటీ ఇచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎంబీటీ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. యాకుత్​పురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎంబీటీ క్యాండిడేట్ అంజదుల్లా మజ్లిస్​కు ముచ్చెమటలు పట్టించాడు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్ కూడా ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చారు. కార్వాన్​లో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్, ఎంఐఎం అభ్యర్థి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ మూడు స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులు చివరి నిమిషంలో గట్టెక్కారు.

అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్ లోక్​సభ స్థానంలో మజ్లిస్​కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. ఎంఐఎంపై విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. అనూహ్యంగా విరించి హాస్పిటల్స్ చైర్​పర్సన్ మాధవీలతకు చాన్స్ ఇచ్చింది. సోషల్ యాక్టివిటీస్‌‌‌‌, యజ్ఞాలు నిర్వహణ, గోశాల ఏర్పాటు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మాధవీలత సోషల్‌‌‌‌ మీడియాలో యాక్టివ్‌‌‌‌గా ఉన్నారు. ఆమె చేసిన కొన్ని ప్రసంగాలు బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దీంతో ఆమెను అసదుద్దీన్ ఒవైసీపై నిలబెట్టాలని భావించి టికెట్ కేటాయించింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆమెకు టికెట్ ఇచ్చి.. బీజేపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి యాదవ అభ్యర్థి

హైదరాబాద్‌‌‌‌ లోక్‌‌‌‌సభ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దించింది. పాతబస్తీలో యాదవ సామాజికవర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీ మాజీ గ్రంథాలయ చైర్మన్‌‌‌‌ గడ్డం శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌కు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. సామాజికవర్గంతో పాటు వ్యక్తిగతంగా ఓల్డ్‌‌‌‌ సిటీలో శ్రీనివాస్ యాదవ్​కు మంచి పట్టున్నట్టు సమాచారం. దీంతో ఎక్కువ ఓట్లు సాధించే ప్రయత్నం చేస్తున్నది.

మహిళను రంగంలోకి దించే యోచనలో కాంగ్రెస్‌‌‌‌

2004, 2009 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్​తో అంతర్గత పొత్తు కొనసాగించింది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో మాత్రం తమ అభ్యర్థులను పోటీకి దింపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య అండర్ స్టాండింగ్ కనిపిస్తున్నా.. మహిళా అభ్యర్థిని బరిలో దించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తున్నది. సుప్రీం కోర్టు అడ్వకేట్ షాహనాజ్ తబస్సుమ్​ను రంగంలోకి దించాలని భావిస్తున్నది. తబస్సుమ్.. వక్ఫ్ బోర్డు సీఈవో సయ్యద్ ఖాజా మొయినొద్దీన్ సతీమణి. ఆమెను రంగంలోకి దించితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నది.

చీలనున్న మజ్లిస్ వ్యతిరేక ఓటు

మజ్లిస్‌‌‌‌ పార్టీ వ్యతిరేక ఓట్లను మూడు పార్టీలు చీల్చనున్నాయనే వాదనలు ఉన్నాయి. హిందూ ఓట్లను బీజేపీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. హిందువుల్లో ఎక్కువ శాతం ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లను బీఆర్ఎస్ చీల్చే అవకాశం ఉంది. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంత ఎక్కువ ఓట్లు చీలిస్తే.. అది మజ్లిస్‌‌‌‌కు అంతే ప్లస్‌‌‌‌ అయ్యే అవకాశం ఉంది. కాగా, మజ్లిస్‌‌‌‌ను వ్యతిరేకించే మహిళలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌‌‌‌ పార్టీ లేడీ క్యాండిడేట్​ను రంగంలోకి దించే అవకాశం ఉన్నది. మజ్లిస్‌‌‌‌ పార్టీ వ్యతిరేక ఓట్లు మూడు పార్టీలు చీలిస్తే.. అది అసదుద్దీన్ ఒవైసీ గెలుపునకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్​పై ఏమేరకు ప్రభావం చూపుతాయో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.