కరోనా రోగుల్లో జ్వరం లక్షణాలు తక్కువే!

కరోనా రోగుల్లో జ్వరం లక్షణాలు తక్కువే!

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా జ్వరం వచ్చినా కరోనా అని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్స్‌లో జ్వరం లక్షణాలు తక్కువే అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పబ్లిష్ చేసిన జర్నల్ ద్వారా తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా రోగుల్లో జ్వరం లక్షణాలు కేవలం 17% మాత్రమే ఉన్నాయని సదరు జర్నల్ పేర్కొంది. హరియాణాలోని జజ్జార్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) తరౌమా సెంటర్‌‌లో జ్వరంతో బాధపడుతున్న 144 మందిని ఐసీఎంఆర్ పరిశీలించింది. వీరిలో 17 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించామని ఐసీఎంఆర్ పేర్కొంది.

‘కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెలువడిన రిపోర్ట్స్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. చైనీస్ కోహోర్ట్‌ రిపోర్ట్‌లో 44 శాతం మందికి జ్వరం సింప్టమ్స్‌ ఉన్నాయని బయటపడింది’ అని ఆ స్టడీ స్పష్టం చేసింది. కరోనా లక్షణాల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసట అని మొదట్లో గుర్తించారు. ఆ తర్వాత ఈ లిస్ట్‌లో వాసన, రుచిని పసి గట్టలేకపోవడం, డయేరియా, కండరాల నొప్పిని కూడా చేర్చారు.