లైవ్లో పాడుతుండగా..సింగర్పై కాల్పులు

లైవ్లో పాడుతుండగా..సింగర్పై కాల్పులు

ఓ సింగర్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లైవ్లో పాడుతుండగా..అగంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సింగర్ తొడకు బుల్లెట్ గాయమైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. 

భోజ్ పురి జానపద గాయని నిషా ఉపాధ్యాయ్ బిహార్ లోని జనతా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరన్ లో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తోంది. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిషా ఎడమ తొడకు బుల్లెట్ గాయమైంది. ఘటన జరిగిన వెంటనే ఆమెను పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం నిషా ఆరోగ్యం నిలకడగా ఉంది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు ఎవరు జరిపారు. కార్యక్రమానికి రివాల్వర్ తో ఎలా ఎంటర్ అయ్యారు..అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. మరోవైపు బిహార్ లో వేడుకలు లేదా కార్యక్రమాల్లో కాల్పులు జరిపితే అక్కడి ప్రభుత్వం వారి లైసెన్స్ ను రద్దు చేస్తోంది. అయినా కూడా దుండగులు వేడుకల్లో కాల్పులు జరపడం ఆపడం లేదు. 

బిహార్ సరన్ లోని గౌర్ బసంత్ గ్రామానికి చెందిన నిషా ఉపాధ్యాయ్..వివిధ నగరాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆమె లేలే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిడా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి ఎన్నో పాటు పాడి ప్రజలను ఆకట్టుకుంది.