WI vs AUS 2025: ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన విండీస్ పేసర్లు.. 180 పరుగులకే ఆలౌట్

WI vs AUS 2025: ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన విండీస్ పేసర్లు.. 180 పరుగులకే ఆలౌట్

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం (జూన్ 25) తొలి టెస్ట్ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ పేసర్ల ధాటికి స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. జేడెన్ సీల్స్, షామర్ జోసెఫ్ ధాటికి తొలి ఇన్నింగ్స్ లో కేవలం 180 పరుగులకే ఆలౌటైంది. జేడెన్ సీల్స్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. షామర్ జోసెఫ్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి కంగారూల జట్టును కోలుకోనీయకుండా చేశాడు. 59 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు పేలవమైన ఆరంభం దక్కింది. అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్ సామ్ కొన్స్టాస్ 3 పరుగులకే ఔటయ్యాడు. మూడో స్థానంలో గ్రీన్ 3 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ రెండు వికెట్లు షమార్ జోసెఫ్ తీసుకున్నాడు. స్మిత్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోష్ ఇంగ్లిష్ 5 పరుగులకే పెవిలియన్ కి చేరడంతో ఆస్ట్రేలియా 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెడ్, ఖవాజా ఆసీస్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. నాలుగో వికెట్ కు 89 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. 

47 పరుగులు చేసిన ఖవాజా ఔట్ కావడంతో ఆసీస్ వికెట్ల పతనం మరోసారి కొనసాగింది. బ్యూ వెబ్‌స్టర్ (11), క్యారీ (8), స్టార్క్ (0) వెంటవెంటనే ఔటయ్యారు. 59 పరుగులు చేసిన హెడ్ ఔట్ కావడంతో ఆసీస్ 143 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కమ్మిన్స్ 28 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 180 పరుగులకు చేర్చాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మొదటి రోజు అట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ ఛేజ్ (1), బ్రాండన్ కింగ్ (23) ఉన్నారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 123 పరుగులు వెనకపడి ఉంది.