జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు కొత్త షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..

జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు కొత్త షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..

Swiggy Zomato: దేశంలో దాదాపు దశాబ్ధకాలం కిందట ఫుడ్ డెలివరీ అగ్రిగేటింగ్ వ్యాపారంలో అడుగుపెట్టిన స్వి్గ్గీ, జొమాటో కంపెనీలు భారీగా ప్రజాధరణను పొందిన సంగతి తెలిసిందే. దేశంలోని అనేక టైర్1, టైర్ 2 నగరాల్లో ప్రస్తుతం ఈ రెండు సంస్థలు తమ సేవలను విస్తరించి ప్రజలకు ఫుడ్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే యూజర్లు రోజురోజుకూ పెరుగుతున్న కొద్ది ఈ సంస్థలు కొత్త ఛార్జీల మోత మోగిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో స్విగ్గీ తమ కస్టమర్లకు స్పెషల్ లాయల్టీ ప్రోగ్రాం కింద అందిస్తున్న సర్ ఛార్జ్ సౌకర్యాన్ని నిలిపివేశాయి. ఈ క్రమంలో జొమాటో గోల్డ్, స్విగ్గీ వన్ మెంపర్ షిప్ కలిగిన యూజర్లు సైతం ఇకపై వర్షం సమయంలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే దానిపై రెయిన్ సర్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి గతంలో లాయల్టీ ప్రోగ్రాం కింద ఉన్న కస్టమర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్ డెలివరీని ఆఫర్ చేసేవి. 

అయితే ప్రస్తుతం కొత్త అప్ డేట్ ప్రకారం స్వగ్గీ వన్, జొమాటో గోల్డ్ కస్టమర్లు సైతం సాధారణ కస్టమర్ల మాదిరిగానే పరిగణించబడటం ద్వారా డెలివరీకి అదనపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడైంది. వాస్తవానికి ఫుడ్ డెలివరీ అగ్రిగేటింగ్ వ్యాపారంలో ఉన్న సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవటానికి ప్రయత్నించటంతో పాటు తమ ఇన్వెస్టర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా లాభదాయకమైన సంస్థలుగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జొమాటో కేవలం రూ.39 కోట్ల లాభాన్ని మాత్రమే ప్రకటించింది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 78 శాతం తక్కువగా ఉంది. 

ఇక స్విగ్గీ విషయానికి వస్తే ఇటీవలి ఆర్థిక ఫలితాల ప్రకారం కంపెనీ నష్టాలు భారీగా పెరిగాయని వెల్లడైంది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.వెయ్యి 081 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నష్టాలు దాదాపు డబుల్ కావటంతో కంపెనీపై ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం రెండు సంస్థలు తమ ఫుడ్ డెలివరీ వ్యాపారం నుంచి ఆదాయాలను పెంచుకోవటం ద్వారా నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే ప్రతి ఆర్డరుపై ఎక్కువ ఆదాయం కోసం కంపెనీలు ప్రయత్నాలు షురూ చేశాయి.