
- అటుకుల టిఫిన్‌లో పురుగులు
- అటుకుల టిఫిన్‌లో పురుగులు
- 35 మంది స్టూడెంట్స్ కు అస్వస్థత
- నారాయణఖేడ్ కేజీబీవీలో ఘటన
- ఏరియా ఆస్పత్రికి తరలింపు
- అందుబాటులో లేని డాక్టర్లు
- ట్రీట్మెంట్ చేసిన కాంపౌండర్లు, నర్సులు
- విచారణకు మంత్రి సబిత ఆదేశం
- నారాయణఖేడ్ కేజీబీవీ హాస్టల్లో ఘటన
నారాయణ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)లో ఫుడ్ పాయిజనింగ్తో 35 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పిల్లలకు పురుగులు పట్టిన అటుకుల టిఫిన్ పెట్టడం వల్లే ఇలా జరిగిందని పేరెంట్స్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జూకల్ శివారులోని కేజీబీవీలో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం కేజీబీవీ హాస్టల్లో స్టూడెంట్లకు అటుకుల టిఫిన్ పెట్టారు. అది తిన్న స్టూడెంట్లలో కొంత మంది వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో 15 మందిని 108 అంబులెన్స్‌లో ఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో 20 మంది స్టూడెంట్లను కూడా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వాంతులు, విరేచనాలతో స్టూడెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఆ సమయంలో ఆస్పత్రిలో ఒక్క డాక్టర్ కూడా లేరు. కాంపౌండర్లు, నర్సులే స్టూడెంట్స్ కు ట్రీట్మెంట్ చేశారు. విషయం తెలుసుకున్న ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హాస్పిటల్ సూపరిండెంట్ వెంకటలక్ష్మికి ఫోన్ చేయగా.. మీరెవరని ఆమె ప్రశ్నించారు. తాను ఖేడ్ ఎమ్మెల్యేనని, స్టూడెంట్స్ అస్వస్థత గురించి చెప్పడంతో ఆమె సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వచ్చారు. నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రిని పలుమార్లు సందర్శించిన మంత్రి హరీశ్‌రావు.. డాక్టర్లు, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. శనివారం ఉదయం10 గంటలకు 12 మంది డాక్టర్లు హాస్పిటల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటే.. ఒక్కరు కూడా లేరు. స్కూల్‌ను పరిశీలించిన డీఈవో నాంపల్లి రాజేశ్ పిల్లల ఆహారం పట్ల అశ్రద్ధ వహించిన స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరితోపాటు నలుగురు వంట వారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
విచారణకు మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నారాయణఖేడ్ కేజీబీవీలో 35 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యా శాఖ మంత్రి సబిత స్పందించారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను మంత్రి ఆదేశించారు. అస్వస్థతకు గురైన స్టూడెంట్లకు మెరుగైన ట్రీట్ మెంట్ అందేలా చూడాలని డీఈఓకు చెప్పారు.