- ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో..
- తీరనున్న ప్రజల చిరకాలవాంఛ
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. మంచిర్యాల రైల్వే ట్రాక్ ను దాటేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేస్తూ రైల్వేశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజలు, విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులు అతి కష్టం మీద రైల్వే ట్రాక్దాటి రాకపోకలు సాగిస్తున్నారు. మూడు రైల్వే లైన్లు ఉండడం, నిత్యం రైళ్ల రాకపోకల వేళ ట్రాక్ దాటుతూ స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
దీంతో ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. విషయాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎఫ్ఓబీ ఏర్పాటు చేయాలని గత ఆగస్టులో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవను ఎంపీ కలిసి విన్నవించారు. దీంతో ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేస్తూ రైల్వే శాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ చొరవతో బ్రిడ్జి మంజూరైందని, ఏళ్లుగా పడుతున్న తమ కష్టాలు దూరమవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్ఓబీతో ప్రజల రాకపోకలు సులభతరం: ఎంపీ
మంచిర్యాలలో రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు వల్ల హమాలివాడ, సూర్యనగర్, తిలక్‌నగర్, రాజీవ్ నగర్, గోపాలవాడ, సప్తగిరి కాలనీ, అశోక్ రోడ్డు, వేముల బస్తీ, దొరగారి పల్లె ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ లోపు పూర్తిచేస్తారు. ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం మంచిర్యాల పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు. పార్లమెంట్‌పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
