అందరికీ  ఉపయోగపడే టెక్నిక్స్​  

అందరికీ  ఉపయోగపడే టెక్నిక్స్​  

టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్​డేట్ అవుతూ, మనల్ని అప్​డేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అప్​డేట్ చేసేందుకు కొన్ని ఫీచర్స్ వచ్చేశాయి. వాటిలో అందరికీ అవసరమైన ఫీచర్ చాట్ లాక్​. వాట్సాప్​లో చాట్​ లాక్​ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే మ్యూజిక్ లవర్స్​ కోసం పాటలతో నాన్ స్టాప్​ ఎంటర్​టైన్​మెంట్​, టాపిక్ ఫిల్టర్స్​ సాయంతో గూగుల్​లో ఈజీగా సెర్చ్​ చేసుకోవచ్చు. 


పర్సనల్​ చాట్​కు లాక్​


వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్​ని తెస్తుంటుంది. అలాగే ఈసారి ఓ సరికొత్త ఫీచర్​ తీసుకురాబోతోంది. ఈ రోజుల్లో ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే వాళ్ల ఫోన్​ చూస్తే సరిపోతుంది అంటారు. అందులోనూ కొందరికి ఇతరుల పర్సనల్ చాట్స్ చూడాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కానీ, దానివల్ల ఆ ఫోన్​ వాడేవాళ్ల ప్రైవసీకి ఇబ్బంది. దాంతో చాలాసార్లు ఇతరులకు ఫోన్ ఇవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు వాట్సాప్​ తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల ఆ సమస్యకు చెక్​ పెట్టినట్టే. అదేంటంటే... ఫోన్​కి లాక్​ వేసినట్టే వాట్సాప్​లో చాట్​ చేసే నెంబర్​లకు కూడా లాక్​ వేసుకోవచ్చు. ఆ లాక్​ ఓపెన్​ అయితేనే ఆ నెంబర్​తో చేసిన చాట్​ చదవగలరు. ఒకవేళ వేరేవాళ్లు మీ చాట్​ లాక్​ ఓపెన్​ చేయడానికి ట్రై చేస్తే మూడు సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆ మూడు సార్లు పాస్​వర్డ్​ రాంగ్​గా ఎంటర్​ చేస్తే ఆటోమేటిక్​గా చాట్​ మొత్తం క్లియర్​ అయిపోతుంది. దాంతో చాట్​ని చూసే అవకాశం పోతుంది. అలాగే లాక్డ్​ చాట్​లో ఉన్న ఫొటోలు, వీడియో ఫైల్స్ కూడా ఆటోమేటిక్​ డివైజ్​ గ్యాలరీలో సేవ్ కావు. ఈ ఫీచర్​ని ప్రస్తుతం డెవలప్​ చేస్తోంది వాట్సాప్​ టీం.


మ్యూజిక్ అన్​స్టాపబుల్


మ్యూజిక్ లవర్స్​ కోసమే మ్యూజిక్ స్ట్రీమింగ్​ సర్వీస్​లు బోలెడు వచ్చాయి. అయితే, ఈ యాప్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. కొన్నిసార్లు ఒక యాప్​ తీసేసి, మరొకటి వేసుకున్నప్పుడు ఇంతకుముందు ప్లే లిస్ట్​లో ఉన్న పాటలన్నీ కొత్తదాంట్లోకి ట్రాన్స్​ఫర్‌‌‌‌ చేయాల్సి వస్తుంది. కానీ, అది కాస్త పెద్ద పనే. ఆ పనిని సింపుల్​గా చేసుకునేందుకు నిఫ్టీ టూల్ సౌండీజ్​ హెల్ప్ చేస్తుంది. ఇది మ్యూజిక్​ స్ట్రీమింగ్ యాప్​ల మధ్య మొత్తం ప్లే లిస్ట్​లను ట్రాన్స్ ఫర్ చేస్తుంది. వాటిని సింక్​లో కూడా ఉంచుతుంది. ​దీన్ని వాడాలంటే ఫోన్​లో సౌండీజ్​.కామ్(soundiiz.com)ని ఓపెన్ చేయాలి. అందులో పైన కుడివైపున ఉన్న బటన్​ క్లిక్​ చేసి లాగిన్ కావాలి. దాంతో డైరెక్ట్​గా సౌండీజ్​ యాప్​కి వెళ్తారు. ఆ తర్వాత ఎడమవైపు పైన ఉన్న హాంబర్గర్ మెను గుర్తును క్లిక్ చేసి, కింద వైపు ఆన్​లో ఉన్న కనెక్ట్ సర్వీసెస్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్లే లిస్ట్ లేదా సింక్ సర్వీస్​ కోసం కనెక్ట్ బటన్ నొక్కాలి. అయితే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ప్లే లిస్ట్​లను ట్రాన్స్​ఫర్ చేయలేం. మరి ఎలా సింక్​ చేయాలి అంటే.. మెను ఓపెన్ చేసి, ఫస్ట్ ప్లే లిస్ట్​ మీద నొక్కి కన్ఫర్మ్ చేయాలి. తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి, రెండో ప్లే లిస్ట్​ సెలక్ట్ చేయాలి. ఇందులో ట్రాక్స్ సెలక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతిరోజు లేదా ప్రతి నెలా సింక్​ చేసుకునేందుకు ఫ్రీక్వెన్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ కాన్ఫిగరేషన్​ మీద​ నొక్కాలి.


గూగుల్ కొత్త ఫీచర్


టాపిక్ ఫిల్టర్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. దాని ద్వారా యూజర్లు సెర్చ్ చేసిన పదం బట్టి ఆయా సబ్జెక్ట్స్​ను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పేజి(SERP)లో సూచిస్తుంది. ఉదాహరణకు.. Google Pixel 7 కోసం సెర్చ్ చేస్తే..  రిజల్ట్స్‌‌లో షాపింగ్, ఫొటోలు, న్యూస్ వంటి కామన్ సెర్చ్ ట్యాబ్‌‌లకు కుడి వైపున ‘Details‘, ‘Reviews‘ వంటివి కూడా చూపిస్తుంది. గూగుల్ సెర్చ్ డెస్క్‌‌టాప్ వెర్షన్‌‌కు ఈ కొత్త ఫీచర్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇందులో టాపిక్స్​ సెర్చ్ చేసే కొద్దీ రిజల్ట్స్ మారుతున్నాయి. అందువల్ల ఈ సర్వీస్​ వాడే వాళ్లకు వాళ్లు వెతుకుతున్న సబ్జెక్ట్​ను కచ్చితంగా ఇవ్వగలుగుతుంది. ఇందులోని ఫిల్టర్స్​ను సెట్ చేసేందుకు యూజర్లకు అనుమతించే ‘All Filters’ అని, లేబుల్ కింద కొత్త డ్రాప్-డౌన్ మెనుని కూడా గూగుల్ తెచ్చింది. ఇప్పటివరకు సెర్చ్ ట్యాబ్‌‌లు ఎనిమిది కేటగిరీలుగా చూపించింది. అందులో ఫొటోలు, మ్యాప్‌‌లు, షాపింగ్, వార్తలు, వీడియోలు, విమానాలు, పుస్తకాలు, ఫైనాన్స్ అనేవి ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఇతర భాషలు, ప్రాంతాలకు విస్తరించాలి అనుకుంటోంది గూగుల్.