కూతురు కోసం 30 ఏళ్లుగా పురుషుడి అవతారంలో..

కూతురు కోసం 30 ఏళ్లుగా పురుషుడి అవతారంలో..

ఈ ప్రపంచంలో అమ్మకు మించిన దైవం ఏముంటింది..? ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ కష్టాన్ని పంటి బిగువునా భరిస్తూ తన బిడ్డలను ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. భగవంతడు అన్ని చోట్లా తానుండలేకే అమ్మను సృష్టించాడని అంటుంటారు. అందుకే మాతృదేవోభవ అంటూ ప్రతిరోజూ ‘అమ్మ’ను తలచుకుంటూ ఉంటాం. 

మిళనాడుకు చెందిన ఓ తల్లి కూతురు కోసం తన జీవితాన్నే అంకితం చేసింది. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపింది. కన్న బిడ్డ కోసం వెలకట్టలేని త్యాగాలు చేసింది. బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం తాను కష్టాలు పడుతున్నా లెక్క చేయకుండా ఎందరో తల్లులకు ఆదర్శంగా నిలిచారామె. ఇప్పుడామెను అందరూ శభాష్ తల్లి అని పొగడుతున్నారు. అసలింతకు ఎవరామె..?

30 ఏళ్ల క్రితం తమిళనాడు తూత్తుకుడిలోని కటునాయకన్ పట్టి గ్రామానికి చెందిన పెచ్చియమ్మాళ్ (20)కు పెళ్లి అయిన 15 రోజులకే గుండెపోటుతో భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత పెచ్చియమ్మాళ్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. తండ్రి లేని బిడ్డను కష్టపడి పెంచి మంచి స్థాయిలో చూడాలనుకుంది. మళ్లీ చేసుకోకుండా ఒక్కగానొక్క కూతురిని ఉన్నత స్థాయికి చేర్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కూలీ పనులకు వెళ్లింది. అయితే.. పని చేసే చోట వేధింపులను ఎదుర్కొంది. పని ప్రదేశాల్లో కొంతమంది మగవాళ్ల చూపులు, వెకిలి చేష్టలు పెచ్చియమ్మాళ్ ను ఇబ్బంది పెట్టాయి. ఈ సమాజంలో ఒంటరి మహిళగా బతకడం కష్టమని భావించింది. పురుషుడిగా మారాలని ఆరోజే గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. 

పురుషుడిగా మారడం కోసం..

పురుషుడిగా మారేందుకు తన హెయిర్ ను కట్ చేయించుకుని, లుంగీ, చొక్క ధరించింది. ఆహార్యం ఎంతలా మారిపోయిందంటే మగవాళ్లు కూడా ఆమెను గుర్తు పట్టలేనంతగా తనను తాను మార్చుకుంది. తన పేరును కూడా ముత్తుగా మార్చుకుంది.  ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతాతో సహా అన్ని రికార్డుల్లోనూ తన పేరును ముత్తుగా మార్చుకుంది. ఇలా 30 ఏళ్లుగా ముత్తు చెన్నై, తూత్తుకుడిలోని హోటళ్లు, టీ దుకాణాలు వంటి చాలా ప్రాంతాల్లో పని చేశారు. ఆమె పని చేసిన ప్రతి చోటా ‘అన్నాచి’ (పెద్దన్న) అని చాలామంది పిలవడం ప్రారంభించారు. 

అంతా కూతురు కోసమే..

మొదట్లో పురుషుడిగా ఉండడం కష్టంగా అనిపించినా కూతురు కోసం తాను అలా ఉండాల్సి వచ్చిందని చెప్పింది. పురుషుడి గెటప్ లో ఉన్నప్పుడు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. కొన్నిసార్లు బస్సుల్లో ప్రయాణించినప్పుడు పురుషులు కూర్చునే సీట్లలోనే కూర్చునేవారని, ఆ సమయంలో డబ్బులు చెల్లించి టిక్కెట్ తీసుకునేవారని తెలిపారు. 

సంక్షేమ పథకాలకు దూరంగా ‘ముత్తు’

తన కుమార్తె బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని పొదుపు చేశారు. తన కూతురికి పెళ్లి చేసి, తన బాధ్యతలను నెరవేర్చారు. అంతేకాదు.. పురుషుడి గెటప్ ఉండడం వల్ల ప్రభుత్వం అందించే ఎన్నో సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో మగ వేషధారణ ఉన్న ఫోటోలు ఉండడంతో వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకోలేకపోతోంది. అధికారులు గుర్తించి పింఛను వచ్చే ఏర్పాటు చేస్తే కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుందని పెచ్చియమ్మాళ్ ఆశపడుతోంది. 

స్టాలిన్ ప్రభుత్వానికి పెచ్చియామ్మాల్ కూతురు వినతి

తన కోసం తల్లి పురుషుడిలా మారి ఎన్నో ఇబ్బందులకు గురైందని పెచ్చియామ్మాల్ కూతురు షణ్ముక చెప్పారు. ధ్రువీకరణ పత్రాల్లో తన తల్లి పురుషుడి పేరుతో ఉండడం వల్ల పింఛను రావడం లేదని, ఈ వయసులో అమ్మకు పింఛను వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని వేడుకుంటోంది. స్టాలిన్ ప్రభుత్వం పెచ్చియామ్మాల్ కు పింఛన్ తో పాటు ఇతర అన్ని పథకాలు అందివ్వాలని మనమూ కోరుకుందాం..

మరిన్ని వార్తల కోసం..

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్ 

చివరి దశకు కాంగ్రెస్ మేథోమధనం..ఇవాళ కీలక ప్రకటన!

రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి