
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాతే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలను గురువారం (మే 8) కేంద్ర విదేశాంగ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ పౌరులు చనిపోయారనేది అవాస్తవం. అలాగే, పాక్‌లోని ప్రార్థనా స్థలాలపై మేం దాడులు చేయమనేది వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు.
పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయినా పాకిస్థాన్ ప్రస్థానమే అబద్ధాలతో మొదలైందని.. అసత్య ప్రచారాలు చేయడం ఆ దేశానికి అలవాటేనని.. ఇది మాకు ఏమి ఆశ్చర్యం కలిగించలేదని ఎద్దేవా చేశారు. పహల్గాం దాడితో ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది పాకిస్థానేనని.. ఆపరేషన్ సిందూర్ పాక్ దుశ్యర్యకు సమాధానం మాత్రమేనని అన్నారు. మేం ఎక్కడా పాక్ మిలటరీ స్థావరాలపై దాడి చేయలేదని.. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే ఎటాక్ చేశామని క్లారిటీ ఇచ్చారు.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థే పహల్గాం దాడికి పాల్పడిన టీఆర్ఎఫ్. పహల్గాంలో దాడులకు పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ రెండు సార్లు ప్రకటించుకుంది. యూఎన్ కౌన్సిల్లో టీఆర్ఎఫ్ రద్దును పాక్ వ్యతిరేకించింది. ఆల్ ఖైదీ వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ ఎక్కడో దొరికాడో గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సమాజాన్ని పాక్ పక్క దారి పట్టిస్తోంది. అనేక మంది టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూ.. పైకి మాత్రం మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదని బుకాయిస్తోంది.
►ALSO READ | చీనాబ్ ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా .. పాకిస్తాన్కు భారీగా వరద నీరు.. ఆ ప్రాంతాకు ముంపు తప్పదు
పలు దాడుల్లో పట్టుబడ్డ ఉగ్రవాదులకు పాక్ ప్రమేయం ఉందని రుజువైంది. ప్రభుత్వ లాంఛనాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల వీడియోలు చూస్తే పాక్ వైఖరి ప్రపంచానికి అర్థం అవుతోంది. మతపరమైన ప్రదేశాలను పాక్ దుర్వినియోగం చేస్తోంది. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసిందని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతోనే సింధూ జలాల ఒప్పందం రద్దు చేశామని ఆయన తెలిపారు.