నాణ్యమైన విద్య కోసమే గురుకులాల ఏర్పాటు : స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి

నాణ్యమైన విద్య  కోసమే గురుకులాల ఏర్పాటు : స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి

నస్రుల్లాబాద్​, వెలుగు : పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడానికే సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి చెప్పారు. నస్రుల్లాబాద్ లో రూ.  5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో అదనపు వసతి గృహ భవనానికి ,  బాన్సువాడ రూరల్​ మండలం కోనాపూర్-హన్మాజీపేట వద్ద కొత్తగా మంజూరైన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు రూ.12 కోట్లతో నిర్మించే భవనానికి మంగళవారం స్పీకర్​ పోచారం, గిరిజన సంక్షేమం, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. 

అంతకముందుగా నస్రు ల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని భవనంలో తాత్కాలికంగా కొత్త ఎస్టీ గురుకుల పాఠశాల క్లాసులను  ప్రారంభించారు. వెంకటాపూర్ సేవాలాల్ మందిరంలో    పూజలు చేశారు.  అనంతరరం స్పీకర్​ మాట్లాడుతూ అందరూ బాగుపడాలన్నదే తమ ఆశయమన్నారు. తర్వాత మంత్రి సత్యవతి  మాట్లాడుతూ.. సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప నాయకుడు  కేసీఆర్ అని అన్నారు.  ఎస్టీ  హాస్టళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం50కి పైగా శాశ్వత భవనాలను నిర్మించిందన్నారు.  ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకించి రెసిడెన్షియల్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ ఏర్పాటుచేసిందన్నారు.  

కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఆర్డీవో భుజంగరావు,   ప్రజాప్రతినిధులు, నాయకులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.