- అనారోగ్యంతో చనిపోయిన ఇస్మాయిల్ జుల్ఫికర్ అహ్మద్
- నివాళులర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
- సంతాపం తెలిపిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్సీనియర్నేత ఇస్మాయిల్ జుల్ఫికర్ అహ్మద్(65) చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఇస్మాయిల్ శుక్రవారం మృతిచెందారు. మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్ పెద్ద కుమారుడైన ఇస్మాయిల్ 2012 నుంచి 2018 వరకు చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఓ వైపు రాజకీయంలో, మరో వైపు వ్యాపారంలో చురుకైన పాత్ర పోషించారు.
కోటపల్లి, చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంచి పట్టున్న ఇస్మాయిన్ జుల్ఫికర్ కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేశారు. జుల్ఫికర్ భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నూరులోని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు పాత బస్టాండ్ సమీపంలో గల ఖబ్రస్తాన్‌లో ఖననం చేశారు.
జుల్ఫికర్ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన మంత్రి వివేక్
ఇస్మాయిల్ జుల్ఫికర్ అహ్మద్ మృతి పట్ల రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జుల్ఫికర్ మృతి విషయం తెలియగానే మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని జుల్ఫికర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జుల్ఫికర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ వేర్వేరుగా మాట్లాడుతూ.. చెన్నూరు ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జుల్ఫికర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
