హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ శాసనసభ పక్ష(ఎల్పీ) నేతగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన ఎల్పీ సమావేశంలో మాజీ స్పీకర్పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ పక్షనేతగా కేసీఆర్పేరు ప్రతిపాదించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు చప్పట్లతో ఆమోదం తెలిపారు. శాసనసభ పక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ సమవేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో సిటీలోని యశోద హాస్పిటల్లో ఆయనకు ఆపరేషన్చేశారు. దీంతో ఆయన సమావేశానికి హాజరుకాలేదు. కేసీఆర్‌తో పాటే హాస్పిటల్లో ఉన్న బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్పీ సమావేశానికి రాలేదు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్థానికంగా లేకపోవడంతో హాజరవలేదు. ముషీరాబాద్ఎమ్మెల్యే ముఠా గోపాల్తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లడంతో ఎల్పీ మీటింగ్‌కు రాలేదు. వీరు మినహా మిగతా 35 మంది ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.
గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు అక్కడే బ్రేక్ఫాస్ట్చేశారు. ఆ తర్వాత అందరు కలిసి ఒకే బస్‌లో గన్‌పార్క్‌కు చేరుకున్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు.
