
- స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు
- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన
చివ్వెంల, వెలుగు: మద్యం మత్తులో యువకుడిపై బీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్, అతని అనుచరులు దాడికి దిగి హత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన ప్రకారం.. సూర్యాపేట టౌన్ దురాజ్ పల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ బాషాకు మునీర్ ఖాన్ ప్రధాన అనుచరుడు. కాగా.. కొంతకాలంగా వీరి మధ్య వ్యక్తిగత తగాదాలు నెలకొన్నాయి. శనివారం ఇరువురూ దురాజ్ పల్లిలో ఎదురుపడ్డారు. దీంతో బాషా తన అనుచరులతో మునీర్ ఖాన్ పై దాడికి పాల్పడడంతో గాయపడిన అతడు తప్పించుకొని పక్కింట్లో తలదాచుకున్నాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఉదయం బాషాను అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ నేత అరెస్ట్ను నిరసిస్తూ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు పలువురు పార్టీ నేతలు స్టేషన్ కు వెళ్లి బైఠాయించారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ కౌన్సిలర్ ను పోలీసులు విడిచిపెట్టారు. బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మాజీ కౌన్సిలర్ బాషాను పరామర్శించి మాట్లాడారు. పోలీసుల అరెస్ట్ దుర్మార్గమని మండిపడ్డారు.