బీసీసీఐ కొత్త అధ్యక్షునిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎన్నికయ్యాడు. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులంతా రోజర్ బిన్నీని ఎన్నుకున్నారు. రోజర్ బిన్నీ బీసీసీఐకి 36వ అధ్యక్షుడు కావడం గమనార్హం. అధ్యక్షుడితో పాటు...ఏజీఎంలో బోర్డు నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు.
గంగూలీ ఇక మాజీ అధ్యక్షుడు...
ముంబైలోని తాజ్ హోటల్‌లో బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశం జరిగింది. బోర్డుకు అనుబంధంగా ఉన్న 30కి పైగా క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం పదవీకాలం ముగియటంతో.. సరికొత్త కార్యవర్గాన్ని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఎన్నికున్నారు. ఇప్పటి వరకూ బోర్డు కోశాధికారిగా వ్యవహరించిన అరుణ్ ధుమాల్ ..ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ముంబై క్రికెట్ సంఘం ప్రతినిధి అశీష్ షెలార్ బీసీసీఐ సరికొత్త కోశాధికారి అయ్యారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎంపికయ్యారు. బీసీసీఐ సెక్రటరీగా జైషా కొనసాగనున్నారు.
1983 వరల్డ్ కప్ హీరో..
రోజర్ బిన్నీ..1983లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యుడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన రోజర్ బిన్నీ...18 వికెట్లు పడగొట్టాడు. 67 ఏళ్ల బిన్నీ కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ పని చేశారు. అంతేకాదు 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్కు బిన్నీ కోచ్‌గా వ్యవహరించారు. బెంగాల్ క్రికెట్ టీం కోచ్‌గానూ పని చేశారు. సందీప్ పాటిల్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో.. బిన్నీ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు.
