రికార్డులు సృష్టించిన కలెక్టర్ కన్నుమూత

 రికార్డులు సృష్టించిన  కలెక్టర్ కన్నుమూత
  •     డ్వాక్రా సంఘాలు, దీపం పథకం, కుని ఆపరేషన్లలో రికార్డులు
  •     మంత్రులకు దీటుగా కార్యక్రమాలు
  •     యాది చేసుకుంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు

కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్‌‌గా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించి రికార్డుల కలెక్టర్ గా పేరొందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దేబబ్రత కంఠ మంగళవారం రాత్రి ఒడిశాలోని కళింగ హాస్పిటల్ లో  కన్నుమూశారు. 1987 బ్యాచ్‌కు చెందిన తొలుత ఏపీలోని చిత్తూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ)గా విధుల్లో చేరారు. తన 21 ఏళ్ల సర్వీసులో వరంగల్ జాయింట్ కలెక్టర్ గా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీగా, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీగా పనిచేశారు. తన సర్వీసులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన హయాంలో కరీంనగర్ సిటీ రూపురేఖలు మార్చే అనేక అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు డ్వాక్రా సంఘాలు, దీపం పథకం, కుని ఆపరేషన్లలో రికార్డులు సాధించారు. ఆయన చేసిన సేవలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.  

కరీంనగర్ పై చెరగని ముద్ర.. 

దేబబ్రత కంఠ 1998 నుంచి 2001 వరకు కరీంనగర్ కలెక్టర్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో ఆయన పది కాలాలపాటు నిలిచిపోయేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ సిటీ ప్రజలకు ఇప్పుడు ఆహ్లాదం పంచుతున్న ఉజ్వల పార్క్, డీర్ పార్క్, క్రీడాకారులకు కేరాఫ్ గా నిలుస్తున్న అంబేడ్కర్ స్టేడియం ఆయన హయాంలో ఏర్పాటైనవే. అదే టైంలో కరీంనగర్ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) గా ఉన్న ఆయన భార్య సౌమ్య మిశ్రా పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను అభివృద్ధి చేశారు. కరీంనగర్ సిటీలో మెయిన్ రోడ్ల విస్తరణతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటులో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. అన్ని శాఖల సమన్వయంతో రెండేళ్లలో లక్ష కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి దేశంలో రికార్డు స్థాయి కుని ఆపరేషన్లు నిర్వహించిన జిల్లాగా కరీంనగర్ నిలిపారు.  దీపం పథకం ద్వారా వేలాది మంది పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కృషి చేశారు. కరెంట్​బిల్లులను తగ్గించడానికి సీఎఫ్ఎల్ బల్బ్ ల వినియోగాన్ని ప్రోత్సహించారు.

ఆక్రమణలను అడ్డుకుని.. స్టేడియంగా మార్చి

దేబబ్రతకంఠ ఆటలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు. కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ముక్కాముల సుబ్బారావు, శాట్స్ రిటైర్డ్ ఏడీ  నాగిరెడ్డి సిద్ధారెడ్డి సూచన మేరకు స్పోర్ట్స్​అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ స్టేడియం ఒకప్పుడు చెరువులా ఉండేది. దీనిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తుండడంతో ఎన్టీటీపీసీ నుంచి ఫ్లైయాష్ ఇటుకలు తెప్పించి కాంపౌండ్ నిర్మించారు. అప్పటి డీఐజీ వివేక్ దూబే చొరవతో ఎన్టీపీసీ సహకారంతో 24 ఎకరాల్లో మట్టి నింపారు. స్టేడియంలో దాదాపు 5 ఫీట్ల లోతుతో అథ్లెటిక్స్ ట్రాక్, బాస్కెట్ బాల్ కోర్టులు నిర్మించారు. సైక్లింగ్ వెలోడ్రమ్ నిర్మాణం కోసం మానేర్ డ్యాం సమీపంలో 10 ఎకరాల భూమి కేటాయించారు. ఆయన హయాంలోనే జగిత్యాల, హుజూరాబాద్ మినీ స్టేడియాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ  నిధులు విడుదల చేయించారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ.. 

కరీంనగర్ జిల్లా నుంచి వెళ్లాక హైదరాబాద్ లో కొన్నేళ్లు వివిధ హోదాల్లో పని చేసిన  ఆయన రాజీనామా చేసి ఒడిశా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా అక్కడ సక్సెస్ కాలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ సాధించుకున్న ఐఏఎస్ అధికారుల జాబితాలో కంఠ కూడా ఉంటారు. కానీ అర్ధాంతరంగా రాజీనామా చేసి సొంత రాష్ట్రానికి వెళ్లిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మరుగున పడిపోయినట్లయింది. దేబబ్రత కంఠ, సౌమ్యామిశ్రా దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. 

పలువురి సంతాపం.. 

దేబబ్రత కంఠ ఆకస్మిక మరణంతో జిల్లా క్రీడారంగ బాధ్యులు తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆయన మృతిపట్ల జిల్లా ఒలింపిక్స్​ అసోసియేషన్ బాధ్యులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి,  మహ్మద్ కరీం, గన్ను విజయభాస్కరరెడ్డి, టీఎస్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి  సంతాపం తెలిపారు.