భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నోరు తెరిస్తే కేసీఆర్ చావు గురించే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్లో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన శనివారం ఏర్పాటైన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి లక్ష తులాల బంగారం బాకీ ఉన్నారన్నారు.
రైతు బంధు జాడలేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం కొట్టుకుపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఉగాది తర్వాత రంగంలోకి దిగుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే నెల 4 నుంచి మండలాల పర్యటనలు చేపట్టనున్నట్టు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.
బీఆర్ఎస్ ఆఫీస్ ఎదుట నిరసన
ఎంపీ ఎన్నికల ప్రచారంలో వాడుకొని పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ ఆటో ట్రాలీల యజమానులు మీటింగ్ జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గేట్ ఎదుట ట్రాలీ పెట్టి నిరసన వ్యక్తం చేశారు. పలువురు నాయకులు ట్రాలీ యజమానులతో వాగ్వావాదానికి దిగారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.