ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 

బోయినిపల్లి, వెలుగు: పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మంగళవారం బోయినిపల్లి మండల పోలీస్ స్టేషన్ లో కొత్తగా నిర్మించిన ఎస్ హెచ్ఓ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు. మండలంలోని గ్రామాల్లో శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్, ఎస్ఐ లు అభిలాష్, నాగరాజు పాల్గొన్నారు.     

రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలి

వేములవాడ రూరల్, వెలుగు: రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్​హెగ్డే అన్నారు. మంగళవారం వేములవాడ సర్కిల్, పోలీసు స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు అంకితభావం, జవాబుదారితనంతో పనిచేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ, పెట్రోలింగ్, విజుబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం స్టేషన్ లోని సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. 

కరెంట్​ బిల్లుల కోసం ఇబ్బంది పెట్టొద్దు
మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాల నిర్వహణకు అవసరమైతే మరిన్ని డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమని మంత్రి గంగుల కమలాకర్​ చెప్పారు.  మంగళవారం మంత్రి తన నివాసంలో మండపాల నిర్వహణకు సంబంధించి విద్యుత్ బిల్లుల కోసం రూ.3లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల వద్ద నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు ఆదేశించారు. హిందూ సోదరులు ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా వినాయక నవరాత్రులను జరుపుకోవాలని సూచించారు. ప్రతీ ఏటా గణేశ్​ఉత్సవాలకు విద్యుత్ బిల్లులు తానే చెల్లిస్తున్నాని గుర్తు చేశారు. 

బీజేపీని రాజకీయంగా బొంద పెట్టాలి
 
తిమ్మాపూర్, వెలుగు:  బీజేపీ అంటేనే భారతీయ జుటా పార్టీ అని, ఆ పార్టీని రాజకీయంగా బొంద పెట్టాలని టీఆర్ఎస్​ మండల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం తిమ్మాపూర్​ మండలంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేశ్​ మాట్లాడుతూ.. ప్రజాగోస–- భరోసా యాత్ర పేరిట బీజేపీ వృథా ప్రయాస యాత్ర చేస్తోందన్నారు. నియోజకవర్గంలో ఉనికే లేని బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే రసమయి చేసిన అభివృద్ధి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై అనవసర మాటలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్​ నాయకుడు దేవేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సర్పంచ్ లు శంకర్, అంజయ్య, రాజేందర్, పాల్గొన్నారు.


రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలను సక్సెస్ చేద్దాం

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈనెల 18, 19 తేదీల్లో కరీంనగర్ లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో  కరీంనగర్ లో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలను సక్సెస్​చేయాలని స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.మల్లారెడ్డి కోరారు. మంగళవారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ సెంట్రల్ ఆఫీస్ లో నిర్వహించిన సైక్లింగ్ పోటీల సన్నాహక సమావేశంలో జిల్లా చైర్మన్ వి.నరేందర్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ మధుసూధన్ రెడ్డిలతో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించామని, అదే స్ఫూర్తితో మరోసారి సక్సెస్​ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహిపాల్, రమేశ్ రెడ్డి, జనార్దన్​రెడ్డి, వేణుగోపాల్, దత్తాత్రేయ పాల్గొన్నారు.

తెలంగాణను చక్కబెట్టనోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తారా..!?
 ఎమ్మెల్యే రసమయికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు 
ప్రజాగోస–బీజేపీ భరోసా యాత్రలో మాజీ మంత్రి విజయ రామారావు

గన్నేరువరం, వెలుగు: ఎనిమిదిన్నర ఏండ్లలో తెలంగాణను చక్కబెట్టని సీఎం కేసీఆర్, దేశాన్ని ఉద్ధరిస్తరా అని బీజేపీ నేత, మాజీ మంత్రి విజయ రామారావు ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు  గంగాడి  కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గన్నేరువరం మండలంలో ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ కార్యక్రమం కొనసాగింది.  ఈ సందర్భంగా మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజల ఆదరణతో  తెలంగాణలో బలమైన శక్తిగా అవతరించిన బీజేపీని చూసి భయపడుతున్నారన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న  తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. గన్నేరువరంలో వర్షాలు పడితే  వందల ఎకరాల పంట నీట మునిగిపోవడం, రాకపోకలు నిలిచిపోవడం ఎమ్మెల్యే రసమయి పనితీరుకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.

రసమయి ఎమ్మెల్యేగా ఉన్న ఎనిమిదేండ్లలో మండలాభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. కొత్త మండలమైన గన్నేరువరంలో రోడ్లు కూడా సరిగా లేకపోవడంతో వానాకాలంలో ఉద్యోగులు, విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే రసమయి ఏం చేస్తున్నారని విజయరామారావు ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి, మాడుగుల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, సుధాకర్, మీడియా కన్వీనర్ లోకేశ్, గన్నేరువరం మండల అధ్యక్షుడు శంకర్, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.

బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌ ‌‌కు సన్మానం


గోదావరిఖని, వెలుగు: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గ కన్వీనర్‌‌‌‌గా నియమితులైన పి.మల్లికార్జున్‌‌‌‌ను మంగళవారం గోదావరిఖనిలో బీజేపీ ఎస్సీ మోర్చీ జాతీయ కార్యదర్శి ఎస్‌‌‌‌.కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌‌‌‌ మాట్లాడుతూ పార్లమెంట్‌‌‌‌ పరిధిలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. 

బ్రాహ్మణపల్లి వద్ద  బ్రిడ్జి నిర్మించండి

గోదావరిఖని, వెలుగు:  పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌‌‌‌, బ్రాహ్మణపల్లి, పొట్యాల గ్రామాల మధ్య మర్రిపల్లి రోడ్డులో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఆర్​అండ్​బీ చీఫ్​ ఇంజనీర్‌‌‌‌ రవీందర్ రావును ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో ఎమ్మెల్యే సీఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరద రోడ్డుపై ప్రవహించిందని, దీంతో సోమన్‌‌‌‌పల్లి, ఆకెనపల్లి, పొట్యాల, మద్దిర్యాల  గ్రామాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయన్నారు.  గోదావరిఖనిలో నిలిచిపోయిన కళాభవనం నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్​ ఇన్ చీఫ్  గణపతి రెడ్డిని కోరారు. 

సౌల్ల రామయ్య మృతిపై అనుమానాలు
పౌర హక్కుల సంఘం నాయకులు 

ముస్తాబాద్ వెలుగు: 2018లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సౌల్ల రామయ్య(70) మృతిపై అనుమానాలున్నాయని పౌరహక్కుల సంఘం నాయకుడు మదన కుమారస్వామి తెలిపారు. మంగళవారం ముస్తాబాద్ మండలం మోహినికుంటలో పౌరహక్కుల సంఘం బృందం పర్యటించింది. అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.  మోహినికుంటకు చెందిన రామయ్య ట్రాక్టర్ ఢీకొని గాయపడటంతో సిద్దిపేట హాస్పిటల్​లో చికిత్స పొందుతూ 2019లో చనిపోయాడన్నారు. రామయ్య డెడ్​బాడీకి పోస్ట్​మార్టం చేయకుండానే అంత్యక్రియలు పూర్తి చేయడంపై అనుమానాలున్నాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో శ్రీపతి రాజగోపాల్, వినోద్, రాజేశం, రాజన్న, మహేష్ , సుదర్శన్,బాలయ్య  పాల్గొన్నారు .

గణేశ్​ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

వేములవాడ, వెలుగు: పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో గుడి చెరువులో గణేశ్​ నిమజ్జనం చేసుకోవాలని మున్సిపల్​ చైర్​పర్సన్​ రామతీర్థపు మాధవి తెలిపారు. మంగళవారం  వేములవాడ పట్టణ గుడి చెరువులో జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మున్సిపల్ పాలకవర్గం నుంచి, అన్ని శాఖల సమన్వయంతో చెరువు కట్ట ప్రాంతంలో గ్రావెల్ తో చదును చేసి లైటింగ్, బారికేడ్లు, తాగడానికి నీటి సౌకర్యం, నిమజ్జనం జరిగే స్థలంలో గజ ఈతగాళ్ల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

నిర్వాహకులు అధికారులకు సహకరించాలి

జమ్మికుంట, వెలుగు : ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని, నిర్వాహకులు అధికారులకు సహకరించాలని హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం జమ్మికుంట లోని ఓ ఫంక్షన్ హాలులో గణేశ్​ మండపాల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గణేశ్​నిమజ్జనంలో జాగ్రత్తలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రామచందర్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సై యూనిస్ పాల్గొన్నారు.

గణేశ్​ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

వేములవాడ, వెలుగు: పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో గుడి చెరువులో గణేశ్​ నిమజ్జనం చేసుకోవాలని మున్సిపల్​ చైర్​పర్సన్​ రామతీర్థపు మాధవి తెలిపారు. మంగళవారం  వేములవాడ పట్టణ గుడి చెరువులో జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మున్సిపల్ పాలకవర్గం నుంచి, అన్ని శాఖల సమన్వయంతో చెరువు కట్ట ప్రాంతంలో గ్రావెల్ తో చదును చేసి లైటింగ్, బారికేడ్లు, తాగడానికి నీటి సౌకర్యం, నిమజ్జనం జరిగే స్థలంలో గజ ఈతగాళ్ల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిర్వాహకులు అధికారులకు సహకరించాలి

జమ్మికుంట, వెలుగు : ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని, నిర్వాహకులు అధికారులకు సహకరించాలని హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం జమ్మికుంట లోని ఓ ఫంక్షన్ హాలులో గణేశ్​ మండపాల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గణేశ్​నిమజ్జనంలో జాగ్రత్తలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రామచందర్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సై యూనిస్ పాల్గొన్నారు.

రేషన్​ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్


ఇల్లందకుంట, వెలుగు: మండలంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతోపాటు ఖాళీగా ఉన్న రేషన్​ డీలర్ల భర్తీకి హుజురాబాద్​ రెవెన్యూ డివిజనల్​అధికారి కార్యాలయం నుంచి మంగళవారం  నోటిఫికేషన్​ వెలువడింది.​ రేషన్​డీలర్లను రిజర్వేషన్​ల వారీగా భర్తీ చేయనున్నారు. ఖాళీగా ఉన్న టేకుర్తి ( స్పోర్ట్స్​ జనరల్​), మర్రివానిపల్లి ( బీసీ–బీ మహిళ), కొత్తగా ఏర్పాటయ్యే  మల్లన్నపల్లి (ఈడబ్ల్యూఎస్​మహిళ), గడ్డివానిపల్లి (జనరల్), బోగంపాడు (ఎస్సీ), వాగొడ్డు రామన్నపల్లి(జనరల్)అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 6 నుంచి 21వ తేదీ వరకు మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

కోరుట్ల బంద్ సక్సెస్

 కోరుట్ల, వెలుగు:  గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టిన పీడీ కేసును నిరసిస్తూ మంగళవారం హిందూ ఐక్య వేదిక , వివిధ హిందూ సంఘాలు చేపట్టిన కోరుట్ల పట్టణ బంద్ సక్సెస్​అయింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హిందూ ఐక్య వేదిక నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి మేడిపెల్లి  పోలీస్ స్టేషన్ కి
 తరలించారు. 

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

బోయినిపల్లి, వెలుగు:  మిడ్ మానేర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పెండింగ్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అడిషనల్​ కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని కొదురుపాక, వరదవెల్లి గ్రామాలలో నిర్వాసితుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందని నిర్వాసితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు దరఖాస్తులు ఇచ్చినా  పట్టించుకోలేవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల4 వేలు ఇవ్వాలంటూ యూత్  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగుల వంశీ, బీజేవైఎం నాయకుడు లింగంపల్లి అనిల్, బీజేపీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో అడిషనల్​ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.