ఉద్యమంలో శ్రీధర్ రెడ్డిది కీలకపాత్ర
ఆయన్ని కోల్పోవడం బాధాకరం: వివేక్ వెంకటస్వామి
నివాళి అర్పించిన మాజీ మంత్రి జానారెడ్డి
ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్, వెలుగు : 1969 తెలంగాణ ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పత్ర్యేక రాష్ట్రం కోసం, తెలంగాణ సమస్యల కోసం పోరాడిన ఆయన్ను కోల్పోవటం చాలా బాధాకరమన్నారు. మంగళవారం నందినగర్ బీఎన్ రెడ్డి కాలనీలోని తొలితరం ఉద్యమ నేత, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ శ్రీధర్ రెడ్డి భౌతికకాయానికి వివేక్ వెంకటస్వామి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. తర్వాత వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, 1969లోనే ఓయూ స్టూడెంట్లను ఏకం చేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఉద్యమంలో కాకా దగ్గరకు వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఎలాగైనా తెలంగాణ సాధించాలని నిత్యం పోరాడారని తెలిపారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహప్రస్థానంలో శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.
రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది: జానారెడ్డి
తెలంగాణ సాధనకు శ్రీధర్ రెడ్డి కృషి మరువ లేనిదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఆయనతో తనకు 40 ఏండ్ల అనుబంధం ఉందని గుర్తు చేశారు. శ్రీధర్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించి మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి ఆశించిన తెలంగాణ రాలేదని, ఆయన కోరుకున్న విధంగా పాలన జరగటం లేదన్నారు. ఆయన కోరుకున్న విధంగా పరిపాలన జరిగినపుడే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు. శ్రీధర్ రెడ్డి మరణ వార్త జీర్ణించుకోలేక పోతున్నామని జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. సమాజ సేవ కోసం ఎంతో కృషి చేశారన్నారు.