కాంగ్రెస్‌‌ గెలిస్తే మోదీ తీహార్‌‌కు..కేసీఆర్‌‌ చర్లపల్లి జైలుకు : పొన్నాల లక్ష్మయ్య

కాంగ్రెస్‌‌ గెలిస్తే మోదీ తీహార్‌‌కు..కేసీఆర్‌‌ చర్లపల్లి జైలుకు : పొన్నాల లక్ష్మయ్య
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

హనుమకొండ సిటీ/స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌, వెలుగు : కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే మోదీ తీహార్‌‌ జైలుకు, కేసీఆర్‌‌ చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. శుక్రవారం హనుమకొండ, జనగామ జిల్లా స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై అన్ని వర్గాలను ఏకం చేసేందుకే రాహుల్‌‌గాంధీ భారత్‌‌ జోడో యాత్ర చేపట్టారన్నారు.

మేకిన్‌‌ ఇండియా, హర్‌‌ ఘర్‌‌ జల్‌‌, ఆత్మనిర్భర్ భారత్‌‌, స్విస్‌‌ బ్యాంకులో పేరుకుపోయిన నల్లధనాన్ని తీసుకొస్తానన్న మోదీ మాటలు నీటి మూటలుగా మిగిలాయని విమర్శించారు. బీజేపీది అంతా ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఇప్పటివరకు మూడు సార్లు నోటీసులు పంపినా ఎందుకు అరెస్ట్‌‌ చేయలేదో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కాంగ్రెస్‌‌ గెలవగానే కేసీఆర్‌‌ ఫ్యామిలీకి జైలు తప్పదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ సెప్టెంబర్‌‌ 17ను వాడుకుంటున్నాయని విమర్శించారు.

ALSO READ:  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: దూది శ్రీకాంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌తో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. హన్మకొండలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌‌రెడ్డి, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్‌‌రావు, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఈవీ.శ్రీనివాసరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, నాయకులు లింగాజీ, జగదీశ్​చంద్రారెడ్డి, జూలకుంట్ల శిరీశ్‌‌రెడ్డి, అన్నబోయిన భిక్షపతి, ఎల్లయ్య పాల్గొన్నారు.