చీపురు పట్టిన మాజీ పైలట్

చీపురు పట్టిన మాజీ పైలట్

రిటైర్మెంట్అనగానే చాలామంది ఇంటికే పరిమితమవుతారు. లేదంటే వ్యాపారమో చేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటారు. కానీ పుణెకి చెందిన పైలట్ మాత్రం సోషల్ సర్వీస్కు అంకితమయ్యాడు. ‘స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ పుణెఅంటూ పుణెలోని గల్లీగల్లీని అందంగా మార్చుతున్నాడు. ఒకప్పుడు పాన్ మరకలు, చెత్తాచెదారంతో కంపు కొట్టే వీధులు.. ఇప్పుడు శుభ్రంగా, అందంగా తయారై
వెల్కం చెప్తున్నాయి.

పునీత్​ది లూథియానా. మాజీ పైలట్​ ఆఫీసర్​. చిన్నప్పుడే ఖాకీ​ డ్రెస్సుపై ఇష్టం పెంచుకున్నాడు. ఎన్​సీసీలో చేరి ఆ ముచ్చట తీర్చుకున్నాడు. ఎన్​సీసీ క్యాడెట్​గా ఎన్నో నేషనల్​ క్యాంపులకు వెళ్లాడు. క్యాంపు కార్యక్రమాలు, సదస్సులు పునీత్​శర్మను బాగా ప్రభావితం చేశాయి. అప్పుడే తన లక్ష్యం ఎయిర్​ఫోర్స్​ అని నిర్ణయించుకున్నాడు. ఎయిర్​ఫోర్స్​ వింగ్​ కమాండర్​గా ఇరవై మూడేళ్లు పనిచేశాడు. రిటైర్​మెంట్​ తర్వాత ఇంటికే పరిమితం కాకుండా సమాజానికి ఏదైనా చేయాలనుకున్నాడు.

స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పుణె

ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్​’ నినాదం తీసుకొచ్చాడు. వీధులు, గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చాడు. చాలామంది చీపురు, చెత్తడబ్బాను పట్టుకొని సెల్ఫీలు దిగి ఏదో మొక్కుబడిగా క్లీనింగ్​ చేసినవాళ్లను చూశాం. కానీ పునీత్​ శర్మమాత్రం స్వచ్ఛమైన హృదయంతో ఫ్యామిలీమెంబర్స్​తో కలిసి స్వచ్ఛ పనులు మొదలుపెట్టాడు. ‘స్వచ్ఛ భారత్​.. స్వచ్ఛ పుణె’ అంటూ ఫేస్​బుక్​ పేజ్​తో జనాల్లో పారిశుద్ధ్య సృహ తీసుకొచ్చాడు. పుణెలో ఏదో ఒక స్ర్టీట్​ని సెలెక్ట్​ చేసుకోవడం, వలంటీర్లతో అక్కడి వెళ్లడం, పరిసరాలు శుభ్రంగా ఉంచితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చెప్పడం పనిగా పెట్టుకున్నాడు. పునీత్​శర్మ ప్రయత్నం నచ్చి చాలామంది ఆయనతో నడిచారు. ‘బస్టాప్​లు, రైల్వే స్టేషన్లు అందంగా ఉంటేనే.. ఆ సిటీ అందంగా ఉంటుంది’ అని భావించి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాడు. కేవలం అక్కడి పరిసరాలను క్లీన్​ చేయడమే కాకుండా, అందమైన పెయింటింగ్స్​ వేసి అందరి దృష్టి ఆకర్షించాడు.

  • స్వచ్ఛ వారియర్​ యాక్టివిటీస్​
  • మురికి వీధుల్లోకి వెళ్లి, అక్కడ ఫ్లాష్​మాబ్స్ ​ద్వారా అవగాహన కల్పిస్తారు.
  • లోకల్​వాళ్లతో కలిసి వీధుల్లో చెత్తా చెదారం ఏరి, గోడలకు అందమైన పెయింటింగ్స్​ వేస్తారు
  • సేకరించిన చెత్తను రీసైకిల్​ సెంటర్లకు తరలిస్తారు.
  • వర్షాకాలంలో మొక్కలు నాటుతారు. ‌

అంతకుముందు.. తర్వాత..

ఒకట్రెండు కాలనీలకే పరిమితం కాకుండా, సిటీ మొత్తం క్లీనింగ్​ ప్రోగ్రామ్స్​ చేశాడు. ఆయన ఎక్కడ స్వచ్ఛ కార్యక్రమం మొదలుపెడితే అక్కడ వందల సంఖ్యలో జనాలు వచ్చేవాళ్లు. విద్యార్థులు, ఉద్యోగులు ఆయనతో చెయ్యి కలిపి వీధులన్నీ అందంగా మార్చారు. ఒకప్పుడు పుణె వీధులు పాన్​ మరకలు, చెత్తాచెదారం, మురుగుతో నిండి ఉండేవి. ఇప్పుడు అవన్నీ అందమైన బొమ్మలతో ఆకట్టుకుంటాయి. వీధులు, బస్టాప్​లు, రైల్వేస్టేషన్ల గోడలపై ఆకట్టుకునే పెయింటింగ్స్​ వేయించాడు. టూరిస్టులు, ప్రయాణికులు వాటిని చూస్తూ రిలాక్స్​ అవుతున్నారు. పుణెలోని వీధులు కూడా అందంగా ముస్తాబై ఆకట్టుకుంటున్నాయి.

మార్పు దిశగా..

‘స్వచ్ఛ వారియర్’​ పేరుతో వందమంది వలంటీర్లతో కలిసి వీధులు, కాలనీలు, పబ్లిక్​ ప్లేసులు, సరస్సులను అందంగా మార్చాడు పునీత్​ శర్మ. పారిశుద్ధ్య పనులకే పరిమితం కాకుండా, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. ప్రజలతో మాట్లాడటం, వాళ్లను స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగం చేయడంతో కొద్దికాలంలోనే పుణె క్లీన్​ సిటీగా మార్చగలిగాడు. ఇప్పటివరకు 500 స్వచ్ఛ క్యాంపులు ఏర్పాటు చేశాడు. పుణె మున్సిపల్​ కార్పొరేషన్​తో కలిసి సేకరించిన చెత్తను రీసైకిల్​ చేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చిన మార్పును చూసినవాళ్లు ‘గో పునీత్​ సార్​.. యూ ఆర్​ ట్రు ఇన్​స్పిరేషన్​’ అని అభినందిస్తున్నారు.‌