ఫార్ములా ఈ రేసింగ్​కు వేగంగా ఏర్పాట్లు

ఫార్ములా ఈ రేసింగ్​కు వేగంగా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్​లో జరగనున్న ఇంటర్ నేషనల్ ఫార్ములా ఈ రేసింగ్​కు వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 19, 20 తేదీలు, డిసెంబర్ 10,11 తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. 7 వేల మంది ట్రయల్ రన్​ను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రయల్ రన్ కోసం టికెట్లు కూడా బుక్ మై షోలో అందుబాటులో ఉంచారు. టికెట్ల ధరలను రూ.749, రూ.1,249గా నిర్ణయించారు. గురువారం సంజీవయ్య పార్కులో హెచ్ఎండీఏ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ, హెచ్ఎండీఏ(బీపీపీ) ఓఎస్డీ సంతోష్ మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి బ్యాటరీ కార్లతో ఈ రేస్​ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రేసింగ్ కోసం ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ 2.7 కిలోమీటర్లలో ట్రాక్  ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 600 మీటర్లు ఎన్టీఆర్ గార్డెన్ లోపలి నుంచి ఉంటుందని అన్నారు. 214 చెట్లను తొలగించాల్సి వచ్చిందని, వాటిని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ లో ట్రాన్స్ ప్లాంట్​ చేశామన్నారు.

హెచ్ఎండీఏ అర్బన్ ఫారస్ర్టీ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. చెట్లను తరలించడంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, చెట్లు చనిపోకుండా చర్యలు చేపట్టామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఈ రేసింగ్​లో మొత్తం 11 టీమ్స్, 24 కార్లు పాల్గొంటాయి. మహింద్రా, జాగ్వర్, మెర్సిడెస్ బెంజ్ తదితర కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. ఈ ట్రాక్​పై 320 కిలోమీటర్ల వేగంతో రేసింగ్​కార్లు పరుగులు తీయనున్నాయి. మొత్తం 30 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫార్ములా ఈకి సంబంధించి ఇంకా టికెట్ల ధరలు ఫైనల్ కాలేదు.