ఒక్కో వ్యాక్సిన్ కు ఒక్కో ఫార్ములా!

ఒక్కో వ్యాక్సిన్ కు ఒక్కో ఫార్ములా!
  • డెడ్​ వైరస్​తో కొవాగ్జిన్​ టీకా
  • అడినో వైరస్​ వెక్టార్​తో నాజల్​ వ్యాక్సిన్​
  • అడినో వైరస్​లో కరోనా జీన్​ను పెట్టి కొవిషీల్డ్​ 
  • ఎంఆర్​ఎన్​ఏ టెక్నాలజీతో ఫైజర్​, మోడర్నాలు
  • స్పుత్నిక్​ రెండు డోసులకు రెండు ఫార్ములాలు
  • ఏడీ26 ఫార్ములాతో వస్తున్న జాన్సన్​ వ్యాక్సిన్​


కరోనాపై పోరాటంలో మన కొవాగ్జిన్​.. రష్యా నుంచి స్పుత్నిక్​.. బ్రిటన్​లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​.. అమెరికాలో పైజర్​, మోడర్నా, జాన్సన్​ అండ్​ జాన్సన్​.. ఇలా అధికారికంగా 8 దాకా కరోనా టీకాలు వచ్చాయి. రకరకాల ఫార్ములాలు, పద్ధతులతో కంపెనీలు వాటిని తయారు చేశాయి. ఓ కంపెనీ చనిపోయిన పూర్తి వైరస్​తో టీకాను తయారు చేస్తే.. మరో కంపెనీ ఆ వైరస్​లోని జీన్​ను తీసుకుని చేస్తోంది. ఫార్ములా ఏదైనా టీకా టార్గెట్​ మాత్రం ఒక్కటే.. కరోనాను ఖతం పెట్టడమే! మరి, ఇప్పటిదాకా వచ్చిన వ్యాక్సిన్ల ఫార్ములాలేంటి? అవెలా పనిచేస్తాయి?  
– సెంట్రల్​డెస్క్​, వెలుగు

మన దేశంలో తయారైన మొట్టమొదటి లోకల్​ కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్​. ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​), నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ) సాయంతో భారత్​ బయోటెక్​ టీకాకు రూపమిచ్చింది. కరోనా వైరస్​తోనే అభివృద్ధి చేసిన టీకా ఇది. అయితే, మొత్తం వైరస్​ను లోపలికి ఎక్కించడమంటే ప్రమాదం కదా అని అనుకోవచ్చు.. కానీ, మన ఒంట్లో వైరస్​ మరింత ముదిరిపోకుండా ఉండేందుకు దానిని చంపేస్తారు. వీరోసెల్​ టెక్నాలజీతో పెద్ద మొత్తంలో వైరస్​ను సృష్టించి.. ఆ మొత్తం వైరస్​లను బీటా ప్రొపియోలాక్టోన్​ అనే ద్రావణంలో ఉంచి ఇనాక్టివ్​ చేస్తారు. అలా చనిపోయిన వైరస్​కు అల్యూమినియం అడ్జువెంట్​ను కలిపారు. మామూలుగా వ్యాక్సిన్ల పనితీరు మెరుగ్గా ఉండేందుకు, ఇమ్యూన్​ సిస్టమ్​ వేగంగా స్పందించి మరిన్ని యాంటీ బాడీలు తయారయ్యేందుకు ఈ అడ్జువెంట్​లు ఉపయోగపడతాయి. అల్యూమినియం హైడ్రాక్సైడ్​ జెల్​ కాంబినేషన్​లో తయారైన అడ్జువెంట్​ను కొవాగ్జిన్​లో వాడడం వల్ల.. వైరస్​పై దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

మామూలుగా ఇప్పటిదాకా ఉన్న వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇస్తున్నారు. రెండు డోసులకూ అదే టీకా వేస్తున్నారు. అయితే, స్పుత్నిక్​ వీ విషయంలో మాత్రం ఆ రెండు డోసులూ వేర్వేరు. ఏడీ26, ఏడీ5 అనే రెండు డోసులగా టీకాను గమేలియా రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​, రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్డీఐఎఫ్​) కలిసి తయారు చేశాయి. రెండు డోసులూ అడినోవైరస్​ వెక్టార్లుగానే తయారు చేసినా.. వేర్వేరు అడినోవైరస్​లను వాడారు. మొదటి డోస్​లో భాగంగా స్పైక్​ ప్రొటీన్​ను ఏడీ26 వెక్టార్​లో, రెండో డోస్​లో ఏడీ5 వెక్టార్​లో పెట్టి టీకాకు రూపమిచ్చారు. ఏడీ26 తీసుకున్న తర్వాత కణాల్లోకి వైరస్​ ప్రొటీన్​ జీన్​ విడుదలై యాంటీబాడీలు తయారవుతాయి. మళ్లీ 21 రోజుల తర్వాత రెండో డోస్​ కింద ఏడీ5 ఇస్తారు. దీంతో ఇమ్యూనిటీ మరింత స్ట్రాంగ్​ అయి మరిన్ని యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇదే ఫార్ములా సింగిల్​ డోస్​ టీకా స్పుత్నిక్​ లైట్​నూ రష్యా తయారు చేసింది. 

ఫైజర్​ ఎంఆర్​ఎన్​ఏ టీకా.. కష్టమైన ఫార్ములా

‘ఎంఆర్​ఎన్​ఏ’.. వ్యాక్సిన్లలో అద్భుతమైన టెక్నాలజీ అని సైంటిస్టులు చెప్తారు. ఆ టెక్నాలజీతోనే అమెరికాకు చెందిన ఫైజర్​, జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​ కంపెనీలు కలిసి బీఎన్​టీ162బీ2 అనే కరోనా వ్యాక్సిన్​ను అనే వ్యాక్సిన్​ను తయారు చేశాయి. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లలో ఇదే కాంప్లెక్స్​ (సంక్లిష్టమైన) ఫార్ములా అని అంటారు. కరోనా వైరస్​లోని స్పైక్​ ప్రొటీన్​లోని జీన్​ను తీసి దానిని ఎంఆర్​ఎన్​ఏ (మెసెంజర్​ ఆర్​ఎన్​ఏ)గా మార్చి టీకా తయారు చేశారు. అంటే ఇది ఒంట్లోకి వెళ్లగానే వేగంగా ఇమ్యూన్​ సిస్టమ్​ స్పందిస్తుంది. ఆ వైరస్​ జీన్​ను పక్కాగా కణంలోకి విడుదల చేసేందుకు గానూ 4 హైడ్రాక్సీబ్యుటైల్​ అజానిడైల్​ బిస్​ హెక్సేన్​ 6,1‌‌‌‌–డైల్​ బిస్​ (ఏఎల్​సీ 3015), 2 హెక్సైల్​డెకానోయేట్​,2–పాలీఇథిలీన్​ గ్లైకాల్​–2000ఎన్​,ఎన్​డై టెట్రాడెకైల్​ఎసిటమైడ్​(ఏఎల్​సీ 0159), 1,2–డైస్టీరాయిల్​ఎస్​ఎన్​గ్లిసరో–3–ఫాస్ఫోకొలీన్​ (డీపీఎస్​సీ), కొలెస్ట్రాల్​అనే 4 లిపిడ్లను కలిపి వాహకంగా వాడారు. ఈ లిపిడ్లు వైరస్​ జీన్​ను పట్టి ఉంచుతాయి. వ్యాక్సిన్​ తీసుకునే ఓ వ్యక్తి శరీరంలోని పీహెచ్​కు తగ్గట్టు వ్యాక్సిన్​ పీహెచ్​ను మెయింటెయిన్​ చేసేందుకు ఫాస్ఫేట్​ బఫర్డ్​ సాల్ట్స్​ (పీబీఎస్​– ఉప్పు (సోడియం క్లోరైడ్​), పొటాషియం క్లోరైడ్​, మోనోబేసిక్​ పొటాషియం క్లోరైడ్​, బేసిక్​ సోడియం ఫాస్ఫేట్​ డై హైడ్రేట్​)ను వాడారు. అందుకే వ్యాక్సిన్​ను మైనస్​ 73 డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సి వస్తోందని సైంటిస్టులు చెప్తున్నారు. మరి, అంత చల్లటి వాతావరణంలో వ్యాక్సిన్​ను పెడితే గడ్డ కట్టిపోదా అంటే.. అది జరగకుండా ఉండేందుకు ‘సుక్రోజ్​’ అనే చక్కెరను కలిపారు. దీంతో వైరస్​లోని నానోపార్టికల్స్​ ఒకదానికొకటి అతుక్కుపోకుండా, టీకా గడ్డకట్టకుండా ఇది కాపాడుతుంది. ఇక, అంతా అయిపోయాక ఓ వ్యక్తికి టీకా వేసే ముందు కూడా ఆ వ్యాక్సిన్​ను నార్మల్​ సెలైన్లో వ్యాక్సిన్​ను మిక్స్​ చేసి ఇస్తారట. అది కూడా మన రక్తంలోని ఉప్పు మోతాదుకు అటూఇటూగా ఉండేందుకేనట. వ్యాక్సిన్​ను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఎలాంటి ప్రిజర్వేటివ్​లనూ వాడలేదు. ఇక కే986పీ, వీ987పీ అనే రెండు ప్రోలీన్​ సబ్​స్టిట్యూట్ల వల్ల ఇతర కరోనా వేరియంట్లపైనా బాగా పనిచేస్తుందట. 

జాన్సన్​ అండ్​ జాన్సన్​

జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​ ఫార్ములా స్పుత్నిక్​ వీ ఫార్ములానే. అయితే, రెండు డోసులుగా కాకుండా కేవలం ఒకే ఒక్క డోసులోనే కంపెనీ టీకాను ఇస్తోంది. ఏడీ26 వెక్టార్​లో కరోనా వైరస్​ స్పైక్​ ప్రొటీన్​లోని జీన్​ను ఎన్​కోడ్​ చేసి పెట్టారు. మ్యుటేషన్​ జరిగిన వేరియంట్లనూ గుర్తించేందుకు వీలుగా ఆ స్పైక్​ ప్రొటీన్​లోని రెండు అమైనోయాసిడ్లను తీసేసి వాటి ప్లేస్​లో ప్రోలీన్లను పెట్టారు. సిట్రిక్​ యాసిడ్​ మోనోహైడ్రేట్​, ట్రైసోడియం సిట్రేట్​ డై హైడ్రేట్​, ఇథనాల్​ (ఆల్కహాల్​), 2 హైడ్రాక్సీప్రొపైల్​ బీటా సైక్లో డెక్స్​ట్రిన్​ (హెచ్​బీసీడీ), పాలీసార్బేట్​ 80, సోడియం క్లోరైడ్​, సోడియం హైడ్రాక్సైడ్​, హైడ్రోక్లోరిక్​ యాసిడ్​లను కలిపారు.

వైరస్​ జీన్​తో కొవిషీల్డ్​

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) కలిసి తయారు చేసిన ఈ వ్యాక్సిన్​ ఫార్ములా ‘చేడాక్స్​1 ఎన్​కొవ్​19’. చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే అడినోవైరస్​లను వెక్టార్లుగా వాడారు. కరోనా వైరస్​లోని స్పైక్​ ప్రొటీన్​లో ఉండే జీన్స్​ను ఆ వెక్టార్​లో పెట్టారు. వ్యాక్సిన్​ను వేయగానే ఆ అడినోవైరల్​ వెక్టార్​.. కణాల్లోకి వెళ్లి జీన్​ను విడుదల చేస్తుంది. శరీర కణాలు ఆ జీన్​ను మళ్లీ ఎంఆర్​ఎన్​ఏగా ఆ తర్వాత ప్రొటీన్లుగా మారుస్తుంది. ఆ వైరస్​ ప్రొటీన్లను ఇమ్యూన్​ సిస్టమ్​ గుర్తించి యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఇక, బ్లడ్​ క్లాట్స్​ను బ్రేక్‌  చేసేందుకు టిష్యూ ప్లాస్మినోజెన్​ యాక్టివేటర్​నూ వ్యాక్సిన్​లో కలిపారు. 

మోడర్నా– ఎంఆర్​ఎన్​ఏ1273 

ఫైజర్​లోని ఎంఆర్​ఎన్​ఏ ఫార్ములానే మోడర్నా కూడా వాడింది. లిపిడ్ల వరకు దాదాపు అంతా ఒకే ఫార్ములా అయినా.. కొన్ని మార్పులు చేసింది. బఫర్లుగా ట్రోమీథమైన్​, ట్రోమీథమైన్​ హైడ్రోక్లోరైడ్​, ఎసిటిక్​ యాసిడ్​, సోడియం ఎసిటేట్​లను వాడింది. టీకా గడ్డకట్టకుండా సుక్రోజ్​నూ వినియోగించింది. మిగతా అంతా సేమ్​ టు సేమ్​ ఫైజర్​ ఎంఆర్​ఎన్​ఏ ఫార్ములానే.

కొవాగ్జిన్​ ముక్కు టీకా (బీబీవీ154)

మామూలు కరోనా వ్యాక్సిన్​ కొవాగ్జిన్​తో పోలిస్తే ముక్కు ద్వారా వేసే కొవాగ్జిన్​ (బీబీవీ154) ఫార్ములా పూర్తిగా వేరు. అందులో పూర్తిగా వైరస్​నే తీసుకుంటే.. ఇందులో మాత్రం కేవలం వైరస్​లోని జీన్​నే తీసుకున్నారు. ఆ జీన్​ను మనకు చెడు చేయని మరో వైరస్​ వాహకం (వెక్టార్​)లో పెట్టి బీబీవీ154కు రూపునిచ్చారు. ఇందులో కరోనా వాహకంగా చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే అడినోవైరస్​ను వాడారు. 

కొవిషీల్డ్​: 
అడినోవైరస్​ వెక్టార్​లో స్పైక్​ ప్రొటీన్​ జీన్​ను చేర్చి చేసిన వ్యాక్సిన్​

కొవాగ్జిన్​: 
కరోనా వైరస్​ను చంపి తయారు చేసిన టీకా ఇది.

జాన్సన్​: 
ఓ రకం అడినో వైరస్​లో కరోనా జీన్​ను పెట్టి ఒకే డోసు టీకా.

స్పుత్నిక్​ వీ 
రెండు రకాల అడినోవైరస్​లతో రెండు డోసుల టీకా.