
ఇండియాలో చక్కర్లు కొడుతోన్న విదేశీ బ్రాండ్లు
మరి మన పెన్ యాడబాయె?
ఫౌంటెన్‌పెన్..ఒకప్పుడు స్టేటస్ సింబల్. ఫ్యాషన్ ఐకాన్. సూటు వేసుకుని, కోటు జేబులో ఒక ఫౌంటెన్‌పెన్ పెట్టుకోవడం ఒకప్పుడు కోటీశ్వరులకు ఫ్యాషన్. రాయడం మొదలుపెడితే, చేతికి ఎలాంటి శ్రమ ఇవ్వకుండా చకచకా రాసుకుంటూ పోయే ఫౌంటెన్‌పెన్‌ను ప్రాణంగా చూసుకునేవారెందరో. అలాంటి ఫౌంటెన్‌పెన్ ఇప్పటికీ లక్షల మంది మనసులను దోచుకుంటూనే ఉంది. స్వాతంత్ర్యానికి ముందే ఫౌంటెన్‌పెన్ తయారు చేసిన ఘనత ఇండియాది. అలాంటి దేశంలో ప్రభుత్వ విధానాల వల్లా, మారుతున్న అభిరుచుల వల్లా ఫౌంటెన్‌పెన్ క్రమంగా కనుమరుగైపోయింది. దేశీయ ఫౌంటెన్‌పెన్ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మేకిన్ ఇండియా కింద చొరవ తీసుకుంటే మళ్లీ ఇండియన్ బ్రాండ్ ఫౌంటెన్‌పెన్నులను మార్కెట్లోకి తేవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
ఏదైనా ఇంపార్టెంట్, వాల్యుబుల్ డాక్యుమెంట్లపై సంతకం చేయాలంటే చాలా మంది వాడేది ఫౌంటెన్ పెన్‌నే. ఐఫోన్ ఎలానో, ఫౌంటెన్ పెన్ అలానే అనే ఫీలింగ్‌తో ఉన్న వాళ్లు చాలా మందే కనిపిస్తారు. టెక్నాలజీలో మార్పులు, బాల్, జెల్ పెన్స్ రాకతో ఫౌంటెన్ పెన్స్‌కు కాస్త ఇంపార్టెన్స్ తగ్గినా.. రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్లలో ఫౌంటెన్ పెన్స్ ఇప్పటికీ 10 శాతం మార్కెట్ షేరును సంపాదించుకున్నాయి. అయితే ఈ మార్కెట్ షేరులో, ఇండియన్ ఫౌంటెన్ పెన్స్ బ్రాండ్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే వెంటనే జవాబివ్వలేని పరిస్థితి. మాంట్ బ్లాంక్, పార్కర్, క్రాస్, పెలికాన్, షీఫర్, వాటర్‌మ్యాన్, సైలర్, అరోరా,ల్యామీ,పైలట్ వంటి అన్నీ బ్రాండ్స్ కూడా అంతర్జాతీయ బ్రాండ్సే. టర్కీ, తైవాన్ బ్రాండ్లు కూడా మన మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే స్వతంత్రం రాక ముందే మన దేశంలో ఫౌంటెన్ పెన్ ఉండేది.. మన వాళ్లే ఈ పెన్‌ను రెడీ చేసినా.. మన బ్రాండ్లు మాత్రం మార్కెట్‌లో అంతగా లేకపోవడం ఒకింత ఆశ్చర్యమే. విదేశీ బ్రాండ్లే మన మార్కెట్‌లో చక్కర్లు కొట్టడం విడ్డూరమే. అధికారికంగా ఇండియాలో తొలి ఫౌంటెన్ పెన్‌ను రత్నం పెన్ వర్క్స్ 1932లో తయారు చేసింది. పూర్తిగా దేశంలోనే తయారు చేసిన ఈ పెన్‌ను 1935లో గాంధీజీకి అందజేసి ఆయన మన్ననలను కూడా పొందింది. ఈ రత్నం పెన్ వర్క్స్ కూడా మన పొరుగు రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి పనిచేస్తోంది. ఆర్‌ఎన్ సహ కూడా1911లో ఇండియాలో పలు పేటెంట్లు పొందారు. కానీ ఏమైందో ఏమో ఆర్ ఎన్ సాహా కంటే ముందుగా తొలి ఫౌంటెన్ పెన్‌ను తెచ్చింది రత్నం పెన్ వర్క్సే. రత్నం, రత్నంసన్, గైడర్, డెక్కన్, సుల్తాన్, గామా, పెన్కో, విల్సన్ వంటి ఇండియన్ బ్రాండ్లు ఫౌంటెన్ పెన్‌లను రెడీ చేస్తున్నాయి. కృష్ణవేణి, హార్స్, సులేఖ వంటి బ్రాండ్స్ ఫౌంటెన్ పెన్‌ల కోసం ఇంక్‌ను తయారు చేస్తున్నాయి. దిగుమతి సుంకాలు, దిగుమతులపై పెట్టిన కండిషన్స్ లాంటి మార్పులతో ఫౌంటెన్ పెన్‌లు, ఇంక్‌ల మేకిన్ ఇండియా స్టోరీ పూర్తిగా మారిపోయింది. విదేశీ సంస్థలతో ఇవి కూడా పోటీ పడాల్సి వచ్చింది. వాటి ధాటికి తట్టుకోలేక కొన్ని సంస్థలు క్లోజ్ కూడా అయ్యాయి. దేశీయ పెన్‌ల పరిశ్రమను రక్షించడానికి తొలి నాళ్లలో దిగుమతులపై పెట్టిన కండిషన్స్ సాయం చేశాయి. కానీ పోనుపోను ఇవన్నీ తొలిగిపోవడంతో దేశీయ ఫౌంటెన్ పెన్‌ల పరిశ్రమ క్రమంగా బలహీనపడింది.
టెక్నాలజీలో మార్పులు..
ఓల్డ్ డిప్ పెన్‌లతో పోలిస్తే ఫౌంటెన్ పెన్‌లు వేరేగా ఉండేవి. నిబ్ వెనుకనే లిక్విడ్ ఇంక్ రిజర్వాయర్ ఉంటుంది. అందులోంచే ఇంక్ నిబ్(పాళీ) లోకి చేరి రాయడానికి వీలయ్యేది. బాల్, జెల్ పెన్నుల ధాటితో పాటు ఇంక్ రిజర్వాయర్ టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీలో వచ్చిన మార్పులకు తోడు, కాంపిటిషన్ కూడా పెరిగింది. ఈ కాంపిటిషన్‌కు పలు సంస్థలు పలు రకాలుగా స్పందించాయి. కొన్ని క్లోజయ్యాయి. కొన్ని తమ ప్రొడక్ట్ లైన్స్‌ను మార్చుకున్నాయి. కొన్ని ఫౌంటెన్ పెన్స్ నుంచి బాల్ పెన్స్ మార్కెట్లోకి మారాయి. కొన్ని ఇండియన్ మార్కెట్ కోసం ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. కొన్ని సంస్థలు చైనా నుంచి ఫౌంటెన్ పెన్స్‌ను దిగుమతి చేసుకోవడం పై ఫోకస్ చేశాయి. ఇలా ఫౌంటెన్ పెన్స్ తీరే మారిపోయింది. కానీ ఇటీవల ఫౌంటెన్ పెన్స్ సేల్స్ పెరుగుతూ ఉన్నాయని తాజా స్టడీస్ పేర్కొంటున్నాయి. మళ్లీ ఫౌంటెన్ పెన్స్ కల్చర్ రాబోతుందనే దానికి ఈ సేల్సే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెబుతున్నాయి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫౌంటెన్‌పెన్‌తోనే రాయాలనే రూల్ ఉంది. ఈ తరహా పెన్‌లు ఇప్పటికీ బతికి బట్టకట్టడానికి ఇదో కారణమని అంటున్నారు. డిజిటల్ ప్రొడక్ట్స్, సర్వీసులకు ఆదరణ పెరిగిపోతున్న ఈ కాలంలో మోడ్రన్ కన్జూమర్‌ను ఆకట్టుకోవడానికీ ఫౌంటెన్ పెన్స్‌కు ఛాన్స్ ఉందని చాలా మంది చెబుతున్నారు. ఇండియన్ ఫౌంటెన్ పెన్స్ డిజైన్స్ మాత్రం ఆకర్షణీయంగా లేవని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యత, ధరల విషయంలో మేకిన్ ఇండియా కింద ఫౌంటెన్ పెన్‌లను మళ్లీ ఆకర్షణీయంగా మారిస్తే గ్లోబల్ మార్కెట్లోనూ దూసుకెళ్ళొచ్చని ఎనలిస్ట్‌లు అంటున్నారు.